Stock Market: మార్కెట్లపై ‘ఫెడ్‌’ దెబ్బ.. 1100 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలపై ఫెడ్‌ దెబ్బ గట్టిగా పడింది. ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్‌’ బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది.

Updated : 27 Jan 2022 09:41 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలకు ఫెడ్‌ దెబ్బ గట్టిగా తాకింది. ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్‌’ బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపైనా పడింది. దీంతో నేడు మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 17వేల మార్క్‌ వద్ద ఊగిసలాడుతోంది.

ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1108.25 పాయింట్లు దిగజారి 56,749.90 వద్ద, నిఫ్టీ 323.35 పాయింట్ల నష్టంతో 16,954.60 వద్ద కొనసాగుతున్నాయి.  నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 1 శాతానికి పైగా కుంగింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, విప్రో, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భారీగా నష్టపోతున్నాయి. నిఫ్టీలో కేవలం ఓఎన్జీసీ మాత్రమే లాభాల్లో ఉండటం గమనార్హం. ఐటీ సూచీ 2శాతానికి పైగా పడిపోయింది.

అమెరికాలో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి ఉద్యోగ విపణి బలంగా ఉన్న నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గుచూపుతోంది. ఈ మార్చి నాటికి నెలవారీ బాండ్ల కొనుగోలు కార్యక్రమం ముగియనున్నందున ఆ సమయంలోనే రేట్ల పెంపు చేపట్టే అవకాశముందని ఫెడ్‌ సంకేతాలిచ్చింది. 0.25శాతం పెంచొచ్చని తెలిపింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు మండుతున్న చమురు ధరలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని