Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market Opens: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 144 పాయింట్ల లాభంతో 66,374 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 36 పాయింట్లు లాభపడి 19,778 దగ్గర కొనసాగుతోంది.

Published : 22 Sep 2023 09:35 IST

Stock Market Opens | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలున్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 144 పాయింట్ల లాభంతో 66,374 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 36 పాయింట్లు లాభపడి 19,778 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.83 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

జేపీ మోర్గాన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ బాండ్‌ ఇండెక్స్‌లో భారత్‌ లిస్ట్‌ కానుంది. 2024 జూన్‌ నుంచి ఇండెక్స్‌లో భారత్‌ కనిపించనుంది. దీని వల్ల భారత బాండ్లలోకి వచ్చే ఏడాది పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం ఈరోజు ఈక్విటీ మార్కెట్లపై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం నష్టాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు సైతం అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. నేడు ‘బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌’ తమ వడ్డీరేట్ల పెంపుపై కీలక నిర్ణయం వెలువరించనుంది. మదుపర్లు దీనిపై దృష్టి సారించే అవకాశం ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) గురువారం రూ.3,007 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) రూ.1,158 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు

గమనించాల్సిన స్టాక్స్‌..

  • గ్లెన్‌మార్క్‌ ఫార్మా: తమ అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌(జీఎల్‌ఎస్‌)ను రూ.5,651.5 కోట్లతో నిర్మా లిమిటెడ్‌కు విక్రయించనున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ తెలిపింది. ఒక్కో షేరు రూ.615 ధరకు మొత్తం 9,18,95,379 షేర్లు లేదా 75 శాతం వాటాను విక్రయించడానికి బోర్డు అనుమతి దక్కినట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది.
  • విప్రో: దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో దీర్ఘకాలంగా సీఎఫ్‌ఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జతిన్‌ ప్రవీణ్‌ చంద్ర దలాల్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అపర్ణ అయ్యర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.
  • టాటా మోటార్‌: సూపర్‌చార్జర్ల నెట్‌వర్క్‌ కోసం తమ అనుబంధ బ్రాండ్‌ జాగ్వార్‌.. టెస్లాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది.
  • సంహీ హోటల్స్‌, జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషియన్‌ సర్వీసెస్‌: ఈ ఇరు కంపెనీల షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. సంహీ హోటల్స్‌ రూ.126, జాగిల్‌ రూ.164 ధర వద్ద ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే.
  • రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RVNL): ఝార్ఖండ్‌లో ఆరు వరుసల వారణాసి-రాంచీ-కోల్‌కతా రహదారిని నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐతో ఆర్‌వీఎన్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకొంది.
  • ఐడియాఫోర్జ్‌: 400 నిఘా కాప్టర్లను సరఫరా చేసేందుకు M/s. Strategic Marketingతో ఐడియా ఫోర్జ్‌ ఒప్పందం కుదుర్చుకొంది. దీని విలువ రూ.58 కోట్లు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని