Stock Market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు.. 19,600 చేరువకు నిఫ్టీ

Stock Market Opens: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 202 పాయింట్ల నష్టంతో 65,742 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 57 పాయింట్లు నష్టపోయి 19,607 దగ్గర కొనసాగుతోంది.

Published : 27 Sep 2023 09:36 IST

Stock Market Opens | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 202 పాయింట్ల నష్టంతో 65,742 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 57 పాయింట్లు నష్టపోయి 19,607 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, టైటన్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు సైతం అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. డీమ్యాట్‌ ఖాతాదారులు తమ ఖాతాలకు నామినీ వివరాలను అందించేందుకు గడువును 3 నెలలు పొడిగించి డిసెంబరు 31 వరకు అవకాశం ఇవ్వనున్నట్లు సెబీ తెలిపింది. డిజిటల్‌ చెల్లింపుల్లో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు పెరిగాయని వరల్డ్‌లైన్‌ నివేదిక వెల్లడించింది. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం రూ.694 కోట్ల విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.715 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. 

గమనించాల్సిన స్టాక్స్‌..

  • రేణుకా షుగర్స్‌: అనామిక షుగర్‌ మిల్స్‌లో 100 శాతం వాటాను రూ.235.50 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీ రేణుకా షుగర్స్‌ తెలిపింది. ఈ లావాదేవీ అనంతరం అనామిక షుగర్‌ మిల్స్‌ తమకు పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది.
  • సువెన్‌ ఫార్మాసూటికల్స్‌: విదేశీ పెట్టుబడి సంస్థ అయిన బెర్హయందా లిమిటెడ్‌, సైప్రస్‌.. సువెన్‌ ఫార్మాలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. సువెన్‌ ఫార్మాసూటికల్స్‌ ప్రమోటర్ల నుంచి 50.1 శాతం వాటా (12,75,37,043 ఈక్విటీ షేర్లు) కొనుగోలు చేయడానికి ఈ సంస్థ కొంతకాలం క్రితం ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే.
  • ఐఆర్‌సీటీసీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్‌పై ప్రయాణికుల నుంచి ఎలాంటి కన్వీనియన్స్‌ రుసుము వసూలు చేయబోమని ప్రకటించింది. 24 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకుంది.
  • సుజ్లాన్‌: దిలీప్‌ సంఘ్వీ సహా మరికొంత మంది 2020 ఫిబ్రవరిలో సుజ్లాన్‌తో కుదుర్చుకొన్న ఓ కీలక ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు సమాచారం.
  • ఇన్ఫోసిస్‌: ఇన్ఫోసిస్‌ టోపజ్‌, అజూర్‌ ఓపెన్‌ఏఐ సర్వీస్‌, అజూర్‌ కాగ్నిటివ్‌ సర్వీసెస్‌ కలిసి ఇండస్ట్రీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు విప్రో, ఇన్ఫోసిస్‌ మధ్య ఒప్పందం కుదిరింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని