మార్కెట్‌ సూచీల్లో ఆంక్షల ఆందోళన!

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,216 పాయింట్లు కోల్పోయి 47,615 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 363 పాయింట్లు నష్టపోయి 14,254 వద్ద ట్రేడవుతోంది....

Updated : 19 Apr 2021 10:15 IST

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,216 పాయింట్లు కోల్పోయి 47,615 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 363 పాయింట్లు నష్టపోయి 14,254 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.65 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కఠిన ఆంక్షలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌, తమిళనాడు, రాజస్థాన్‌ సైతం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో చేరాయి. అలాగే అనేక రాష్ట్రాలు వారాంతపు లాక్‌డౌన్లను ప్రకటించాయి.

దిల్లీ, మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌ పరిమిత సరఫరా మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీ మందగించే అవకాశం ఉందని భావిస్తున్న ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి, రికవరీ నెమ్మదిస్తుందని అందుకే జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గిస్తున్నామని తెలిపాయి. ఈ పరిణామాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి.

నిఫ్టీలో విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సిప్లా షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని కంపెనీలు నష్టాల్లో పయనిస్తుండడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని