Stock market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. 24,300 ఎగువన నిఫ్టీ

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 36, నిఫ్టీ 3 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 08 Jul 2024 16:09 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. ఇంట్రాడేలో కాస్త కోలుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా.. ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇటీవల ఈక్విటీలు గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండడమే దీనికి కారణం.

సెన్సెక్స్‌ ఉదయం 79,915.00 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,996.60) నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 79,731.83 - 80,067.46 మధ్య చలించింది. చివరికి 36.22 పాయింట్ల నష్టంతో 79,960.38 వద్ద ముగిసింది. నిఫ్టీ 3.30 పాయింట్ల నష్టంతో 24,320.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. సెన్సెక్స్‌లో టైటాన్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 85.70 వద్ద, బంగారం ఔన్సు 2381 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని