Stock Market Update: నష్టాల్లో ముగిసిన సూచీలు.. +600 నుంచి 100కు సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం  సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది....

Published : 05 Jul 2022 16:01 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ప్రపంచ మార్కెట్లలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలు స్వీకరించేశారు. రూపాయి బలహీనత, వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరడం సూచీలను కలవరపెట్టింది. మరోవైపు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు, యూఎస్‌ ఫ్యూచర్స్‌, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం సూచీలకు ప్రతికూలంగా మారింది. మరోవైపు జూన్‌ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచే అవకాశం ఉందన్న అంచనాలు, చమురుపై అదనపు పన్నులు సైతం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ దశలో 600 పాయింట్లకు పైగా లాభపడ్డ సెనెక్స్‌ చివరకు 100 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ ముగించాల్సి వచ్చింది.

ఉదయం సెన్సెక్స్‌ 53,501.21 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 53,865.93 - 53,054.30 మధ్య ట్రేడయ్యింది. చివరకు 100.42 పాయింట్లు నష్టపోయి 53,134.35 వద్ద ముగిసింది. 15,909.15 వద్ద సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ 16,025.75 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని, 15,785.45 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 24.50 పాయింట్లు ఎగబాకి 15,810.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో జూన్‌ 10 తర్వాత నిఫ్టీ తొలిసారి 16,000 మార్క్‌ను తాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈక్విటీ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.30 వద్ద ట్రేడవుతోంది. 

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, విప్రో, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, మారుతీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని