Automobile: మారుతీ, హ్యుందాయ్‌ మార్కెట్‌ వాటా డౌన్‌.. టాటా, మహీంద్రా జూమ్‌

Automobile Market share: ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత కారణంగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ కంపెనీలకు షాక్‌ తగిలింది. దీంతో స్వల్పంగా వాటి మార్కెట్‌ వాటా క్షీణించింది.

Published : 18 Apr 2023 19:54 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ (Maruti suzuki), హ్యుందాయ్‌కు (Hyundai) గత ఆర్థిక సంవత్సరం షాక్‌ తగిలింది. వాస్తవంలో ఈ రెండు కంపెనీలు తమ విక్రయాలు పెంచుకున్నప్పటికీ తమ మార్కెట్‌ వాటాను మాత్రం స్వల్పంగా కోల్పోయాయి. ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (FADA) వెల్లడించింది. ఈ మేరకు గతేడాది రిటైల్‌ సేల్స్‌ గణాంకాలను ఉటకించింది. అదే సమయంలో టాటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, కియా వంటి కంపెనీలు తమ వాటాను స్వల్పంగా పెంచుకోవడం గమనార్హం.

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ సంస్థ మారుతీ సుజుకీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 14,79,221 యూనిట్లను విక్రయించింది. దేశంలో గతేడాది విక్రయించిన మొత్తం కార్లలో 40.86 శాతం వాటా ఒక్క మారుతీదే. 2021-22లో ఇదే కంపెనీ 12,39,668 యూనిట్లను విక్రయించింది. అప్పట్లో కంపెనీ వాటా 42.13 శాతంగా ఉంది. వాస్తవంలో కార్ల విక్రయాలు పెరిగినప్పటికీ కంపెనీ మార్కెట్‌ వాటా తగ్గడం గమనార్హం. ఇక గత ఆర్థిక సంవత్సరంలో హ్యుందాయ్‌ 5,25,088 వాహనాలను విక్రయించి 14.51 శాతం వాటాను సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే కంపెనీ 16.28 శాతం వాటాతో 4,79,027 యూనిట్లను విక్రయించింది.

ఇక టాటా మార్కెట్‌ విలువ 11.27 శాతం నుంచి 13.39 శాతానికి పెరగడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 3,31,637 కార్లను విక్రయించిన ఆ సంస్థ.. గత ఆర్థిక సంవత్సరంలో 4,84,843 వాహనాలు విక్రయించింది. 2021-22లో మహీంద్రా అండ్‌ మహీంద్రా 1,99,125 (6.77 శాతం) యూనిట్లను విక్రయించగా.. 2022-23లో 3,23,691 (8.94 శాతం) వాహనాలను అమ్మింది. కియా సైతం మార్కెట్‌ వాటాను 5.3 శాతం నుంచి 6.42 శాతానికి పెంచుకుంది. 2021-22లో 1,56,021 యూనిట్లను విక్రయించిన ఆ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 2,32,570 వాహనాలను విక్రయించింది. టయోటా కిర్లోస్కర్‌, స్కోడా ఆటో, ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ మార్కెట్‌ వాటాలు సైతం స్వల్పంగా పెరగడం గమనార్హం. మొత్తం 1435 ఆర్‌టీఓలకు గానూ 1349 ఆర్‌టీఓల పరిధిలో సేకరించిన రిజిస్ట్రేషన్ల డేటా ఆధారంగా ఈ నివేదికను ఫాడా రూపొందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని