Grand Vitara: మారుతీ సుజుకీ మిడ్‌సైజ్‌ SUV గ్రాండ్‌ విటారా వచ్చేసింది..

Grand Vitara: మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్ట్యా కొత్త గ్రాండ్‌ విటారాను (Grand Vitara) మారుతీ సుజుకీ లాంచ్‌ చేసింది.

Published : 26 Sep 2022 22:26 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) మరో కొత్త కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్ట్యా కొత్త గ్రాండ్‌ విటారాను (Grand Vitara) సోమవారం లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.10.45 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.65 లక్షల (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ) వరకు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు స్ట్రాంగ్‌, మైల్డ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ కలిగిన గ్రాండ్‌ విటారా మొత్తం 11 వేరియంట్లలో వస్తోంది. మిడ్‌ ఎస్‌యూవీ విభాగంలో మిగిలిన కంపెనీలతో పోలిస్తే మారుతీ కాస్త వెనకబడి ఉంది. ఆ లోటును గ్రాండ్‌ విటారాతో పూడ్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, టాటా హ్యారియర్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ మోడల్‌కు 57 వేల బుకింగ్‌లు వచ్చినట్లు మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మైల్డ్‌ హైబ్రీడ్‌ టెక్నాలజీ, 5 స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌ కలిగిన 1.5 లీటర్‌ ట్రిమ్స్‌ ధర రూ.10.45 లక్షల నుంచి ప్రారంభమై రూ.17.05 లక్షల వరకు ఉన్నాయి. ఇవి ఒక లీటర్‌కు 21.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని కంపెనీ తెలిపింది. సుజుకీకి పేటెంట్‌ కలిగిన ఆల్‌గ్రిప్‌ టెక్నాలజీతో వస్తున్న మరో ట్రిమ్‌ ధరను రూ.16.89 లక్షలుగా పేర్కొన్నారు. స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌తో వస్తున్న ట్రిమ్స్‌ ధరలు రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.65 లక్షల వరకు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న 420 నెక్సా డీలర్‌షిప్స్‌ వద్ద విక్రయించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని