Maruti Suzuki: మారుతీ సుజుకీ కార్ల కోసం మరింత వేచిచూడాల్సిందేనా?

Maruti Suzuki: ఇప్పటికే మారుతీ సుజుకీ వద్ద 3.5 లక్షలకు పైగా పెండింగ్‌ ఆర్డర్లు ఉన్నాయి. సెమీకండక్టర్ల కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అది మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది.

Published : 05 Mar 2023 23:55 IST

దిల్లీ: సెమీకండక్టర్ల కొరత రానున్న త్రైమాసికాల్లోనూ కొనసాగనున్నట్లు మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్న పెండింగ్‌ ఆర్డర్లు మరింత పెరగనున్నట్లు పేర్కొంది.

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki) వద్ద 3.69 లక్షల కార్లకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎర్టిగా కోసం 94,000 బుకింగ్‌లు లైన్‌లో ఉన్నాయి. 37,000 గ్రాండ్‌ విటారా, 61,500 బ్రెజా కార్లను కస్టమర్లకు అందించాల్సి ఉంది. అలాగే కొత్త మోడళ్లయిన జిమ్నీకి 22,000, ఫ్రాంక్స్‌కు 12,000 బుకింగ్‌లు అందాయి.

సెమీకండక్టర్ల కొరత వల్ల అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో మారుతీ సుజుకీ తమ తయారీని 46,000 మేర కుదించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ సమస్య కొనసాగుతున్నట్లు కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ పరిస్థితి మరికొన్ని నెలల పాటు కొనసాగుతుందని అంచనా వేశారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రయాణికుల వాహన (Passenger Vehicles- PV) విభాగంలో 35.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగినట్లు శ్రీవాస్తవ తెలిపారు. ఏడాది ముగిసే నాటికి అది 38.8 లక్షల యూనిట్లకు చేరొచ్చని అంచనా వేశారు. ఈ విభాగంలో అత్యధికంగా ‘స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (42.6%)’ అమ్ముడవుతున్నట్లు తెలిపారు. తర్వాత 35 శాతం విక్రయాలతో హ్యాచ్‌బ్యాక్‌లు తర్వాతి స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. క్రితం ఏడాది 30.7 లక్షల పీవీల విక్రయం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 26 శాతం వృద్ధితో అది 38.8 లక్షలకు చేరుతుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఈ సంఖ్య 41 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.

వడ్డీరేట్ల ప్రభావం వాహన కొనుగోళ్లపై స్పష్టంగా కనిపిస్తోందన్నారు. క్రితంతో పోలిస్తే డిమాండ్‌ తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే, ఆర్థిక వ్యవస్థ ఇదే రీతిన వృద్ధి చెందితే వాహన రంగంపై ప్రతికూల ప్రభావం తీవ్రత పెద్దగా ఉండదని తెలిపారు. మౌలిక వసతులపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వాహన గిరాకీ పుంజుకోవడానికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని