Maruti Suzuki: బాలెనో, ఎక్స్‌ఎల్‌6లోనూ సీఎన్‌జీ మోడళ్లు

నెక్సా రిటైల్‌ చైనా ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం బాలెనో, ఎక్స్‌ఎల్‌6 కార్లలోనూ సీఎన్‌జీ ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది.

Published : 31 Oct 2022 23:50 IST

దిల్లీ: తమ రిటైల్‌ చైన్‌ నెక్సా ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం కార్లలోనూ సీఎన్‌జీ ఆప్షన్‌ను తీసుకురానున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది సీఎన్‌జీ మోడళ్ల విక్రయాల్లో 75 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే 4 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించాల్సి ఉంటుందని పేర్కొంది. 

నెక్సా రిటైల్‌ చైన్‌ కింద విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో, ఎంపీవీ ఎక్స్‌ఎల్‌6లో ఎస్‌-సీఎన్‌జీని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. వీటి ధరలు వరుసగా రూ.8.28 లక్షలు, రూ.12.24 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటాయని వెల్లడించారు. గత ఏడాది 2.3 లక్షల సీఎన్‌జీ యూనిట్లను విక్రయించినట్లు తెలిపారు. ఈసారి 4 లక్షల వాహనాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. 2010లో ఈకో, ఆల్టో, వేగనార్‌తో సీఎన్‌జీ మోడళ్లను తొలిసారి మార్కెట్‌లోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పటివరకు 1.14 మిలియన్ల యూనిట్లను విక్రయించినట్లు తెలిపారు. 

ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న 16 మోడళ్లలో పదింటిలో సీఎన్‌జీ ఆప్షన్‌ ఉందని శ్రీవాస్తవ తెలిపారు. దీన్ని 12 మోడళ్లకు చేర్చనున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే బాలెనో, ఎక్స్‌ఎల్‌6 సీఎన్‌జీ యూనిట్ల తయారీ ప్రారంభమైందని వెల్లడించారు. నవంబరు తొలివారంలోనే విక్రయాలు ప్రారంభిస్తామన్నారు. బాలెనో ఎస్‌-సీఎన్‌జీలో డెల్టా, మ్యానువల్‌ ట్రాన్స్‌మిషన్‌ రెండు వేరియంట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ధరల శ్రేణి రూ.8.28 లక్షలు- రూ. 9.21 లక్షలు (ఎక్స్‌-షోరూం)గా ఉంటుందన్నారు. ఎక్స్‌ఎల్‌6లో మాత్రం కేవలం మ్యానువల్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంటుందని.. దాని ధర రూ.12.24 లక్షలు (ఎక్స్‌-షోరూం)గా నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని