Maruti Suzuki: 4 లక్షలకు పెరిగిన ‘మారుతీ సుజుకీ’ పెండింగ్‌ ఆర్డర్లు!

మారుతీ సుజుకీ సంస్థ వాహన పెండింగ్‌ ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 4 లక్షలు దాటింది. కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్‌ మోడళ్లకు ఆదరణ ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది. 

Updated : 05 Jul 2023 12:35 IST

దిల్లీ: వాహన బుకింగ్‌లు పుంజుకోవడంతో ఈ ఏడాది జనవరినాటికి సంస్థ పెండింగ్‌ ఆర్డర్లు 4.05 లక్షలకు పెరిగాయని మారుతీ సుజుకీ (Maruti Suzuki) తెలిపింది. ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్‌ మోడళ్ల ఆర్డర్ల సంఖ్యనూ ఇందులో పొందుపర్చినట్లు వెల్లడించింది. ఇప్పటికే జిమ్నీ(Jimny)లో 11 వేల యూనిట్లు, ఫ్రాంక్స్(Fronx)లో దాదాపు 4 వేలకుపైగా బుకింగ్‌లు అందినట్లు పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం నాటికి 3.63 లక్షల వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. ఇందులో 1.19 లక్షల ఆర్డర్లు కొత్తగా విడుదల చేసిన మోడళ్లవేనని పేర్కొంది. ‘‘ప్రస్తుతం దాదాపు 4,05,000 బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డర్ల విషయంలో మంచి వృద్ధి కనిపిస్తోంది. కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్‌ మోడళ్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. జిమ్నీలో రోజుకు 1,000 వాహనాలు, ఫ్రాంక్స్‌లో రోజుకు 300 యూనిట్లు బుక్‌ అవుతున్నాయి’’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.

కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్‌ వాహనాల ధరలను సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. సెమీకండక్టర్ల కొరత వల్ల వాహనాల తయారీ తగ్గి, పెండింగ్‌ ఆర్డర్లు పెరుగుతున్నాయి. ‘మూడో త్రైమాసికంలో సెమీకండక్టర్ల కొరత కారణంగా దాదాపు 46 వేల వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. 2021లో మారుతీ సుజుకీ మొత్తం 13.64 లక్షల వాహనాలు విక్రయించగా.. 2022నాటికి 16 శాతం పెరిగి 15.76 లక్షల యూనిట్లకు చేరుకుంద’ని సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని