Baleno Bookings: ప్రారంభమైన కొత్త బ్యాలెనో బుకింగ్స్‌

బ్యాలెనో కొత్త వెర్షన్‌కు బుకింగ్స్‌ ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది....

Published : 07 Feb 2022 20:28 IST

దిల్లీ: తమ సంస్థ నుంచి వస్తోన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన బ్యాలెనో కొత్త వెర్షన్‌కు బుకింగ్స్‌ ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. రూ.11,000 చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. భారత్‌లో టాప్‌-5 కార్లలో ఒకటిగా నిలిచిన బ్యాలెనోకు మంచి ఆదరణ ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా కార్లను విక్రయించామని మారుతీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.

టెక్నాలజీపై ఆసక్తి ఉండే నేటి తరానికి కొత్త బ్యాలెనో బాగా నచ్చుతుందని శ్రీవాస్తవ వెల్లడించారు. టెక్నాలజీ, ఫీచర్లు, సామర్థ్యం విషయంలో రాజీ పడనివారికి ఇది సరిగ్గా సరిపోతుందని చెప్పుకొచ్చారు. భద్రత, సౌకర్యం విషయంలో కొత్త వెర్షన్‌ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. హెడ్స్‌-అప్‌ డిస్‌ప్లే వంటి అధునాతన పీచర్లు ఉన్నట్లు వెల్లడించారు. కే-సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, ఇడిల్‌ స్టార్ట్‌-స్టాప్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించినట్లు తెలిపారు.


రూ.1.10 లక్షలతో జాంటీ ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

జాంటీ ప్లస్‌ పేరిట అమో ఎలక్ట్రిక్‌ బైక్స్‌ మరో కొత్త విద్యుత్తు స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1.10 లక్షలు (ఎక్స్‌షోరూం). దీంట్లో 60వీ/40ఏహెచ్‌ లిథియం బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జి చేస్తే 120 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ కావడానికి 4 గంటల సమయం పడుతుంది.

క్రూజ్‌ కంట్రోల్‌ స్విచ్‌, ఎలక్ట్రానిక్‌ అసిస్టెడ్‌ బ్రేకింగ్‌ సిస్టం, యాంటీ థెఫ్ట్‌ అలారం వంటి అధునాతన ఫీచర్లు ఉ్ననాయి. సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌, సెంట్రల్‌ లాకింగ్‌, ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌, డీఆర్‌ఎల్‌ లైట్లు, ఇంజిన్‌ కిల్‌ స్విచ్‌, టెలీస్కోపిక్‌ ఫోర్క్‌ సస్పెన్షన్‌, అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఫిక్స్‌డ్‌, పోర్టబుల్‌ బ్యాటరీ ఆప్షన్‌ కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 140 డీలర్‌షిప్‌లలో ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని