Maruti Suzuki: ఆగస్టులో ఆల్‌టైం గరిష్ఠానికి మారుతీ సుజుకీ విక్రయాలు

Maruti Suzuki: ఆగస్టులో మారుతీ సుజుకీ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కంపెనీ చరిత్రలో ఒక నెలలో అత్యధిక విక్రయాలు గత నెలలోనే నమోదు కావడం విశేషం.

Published : 01 Sep 2023 17:21 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విక్రయాలు (Maruti Suzuki Sales) ఆగస్టు నెలలో రికార్డు గరిష్ఠానికి చేరాయి. కంపెనీ టోకు విక్రయాలు గత నెలలో 1,89,082 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో (Maruti Suzuki Sales) ఇదే ఇప్పటి వరకు అత్యధికం. క్రితం ఏడాది ఆగస్టులో సంస్థ 1,65,173 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. ఈసారి దీంట్లో 14 శాతం వృద్ధి నమోదైంది.

దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,34,166 యూనిట్ల నుంచి 1,54,114 యూనిట్లకు పెరిగాయి. ఈ విభాగంలో 16 శాతం వృద్ధి నమోదైంది. ఆల్టో, ఎస్‌-ప్రెసో వంటి చిన్న కార్ల విభాగంలో ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు 22,162 నుంచి 12,209 యూనిట్లకు తగ్గాయి. బ్యాలెనో, సెలెరియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌ వంటి కంపాక్ట్‌ కార్ల విక్రయాలు 71,557 యూనిట్ల నుంచి 72,451 యూనిట్లకు పెరిగాయి.

బ్రెజా, గ్రాండ్‌ విటారా, జిమ్నీ, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 వంటి యుటిలిటీ వెహికల్స్‌ విభాగంలో విక్రయాలు 58,746 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఈ సంఖ్య 26,932 యూనిట్లుగా ఉంది. ఆగస్టు నెల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 21,481 యూనిట్ల నుంచి 24,614 యూనిట్లకు చేరాయి. కంపెనీ షేరు ఇంట్రాడేలో రూ.10,397.95 దగ్గర 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.16 శాతం పెరిగి రూ.10,320 దగ్గర స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని