Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?

మార్చి 2020లో ఉపసంహరించుకున్న ఆల్టో కే10ను తిరిగి తీసుకురావాలని మారుతీ సుజుకీ యోచిస్తున్నట్లు సమాచారం....

Published : 04 Jul 2022 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌’ (SUV) కార్లకు డిమాండ్‌ పెరుగుతుండడంతో ఎంట్రీ లెవెల్‌ హ్యాచ్‌బ్యాక్‌ కార్ల విక్రయాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అయితే, దేశీయంగా అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ మాత్రం ఈ సెగ్మెంట్‌పై దృష్టిని మరింత పెంచింది. ఈ క్రమంలో మార్చి 2020లో ఉపసంహరించుకున్న ఆల్టో కే10ను తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ సెగ్మెంట్‌లో పెద్దగా పోటీ లేకపోవడం, పైగా ఆల్టో కే10కు ఇంకా ఆదరణ ఉన్న నేపథ్యంలో దీన్ని తిరిగి విడుదల చేయాలనుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఎంట్రీలెవెల్‌ హ్యాచ్‌బ్యాక్‌లో మారుతీ సుజుకీకి చెందిన ఎస్-ప్రెసోతో పాటు రెనో క్విడ్‌ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు కార్లకు మార్కెట్‌లో 7.8 శాతం వాటా ఉందని.. కొత్త కారును ప్రవేశపెట్టేందుకు ఇది సరిపోతుందని వాహనరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2021-22లో మారుతీ సుజుకీ 211,762 యూనిట్ల ఆల్టో, ఎస్‌-ప్రెసో కార్లను విక్రయించింది. మరోవైపు రెనో 26,535 యూనిట్ల క్విడ్‌ కార్లు అమ్ముడయ్యాయి. దీంతో 2,50,000 యూనిట్లతో ఈ సెగ్మెంట్‌ బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

2000 సంవత్సరంలో విడుదలైన ఆల్టో 20 ఏళ్లలో 4.3 మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా నిలిచింది. 2012 వరకు తొలి జనరేషన్‌ ఆల్టో కార్లను విక్రయించారు. ఆల్టో కే10ను 2010లో విడుదల చేశారు. తొలుత 998 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌తో వచ్చింది. తర్వాత 1061 సీసీ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. మార్చి 2020లో ఉపసంహరించుకునే నాటికి ఈ కార్లు 8,80,000 కార్లు అమ్ముడయ్యాయి. అయితే 2012లో వచ్చిన ఆల్టో 800కు క్రమంగా ఆదరణ పెరిగి కే10 విక్రయాలు తగ్గాయి. దీంతో ఈ కారు తయారీని నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని