Health Insurance: ఆరోగ్య బీమాలో మెటర్నిటీ కవరేజీ గురించి మీకు తెలుసా?

మహిళలకు గర్భధారణ ముందు, తర్వాత వైద్య చికిత్సా ఖర్చులను కవర్‌ చేయడానికి ఆరోగ్య బీమా పాలసీలు ఎంతగానో సహాయపడతాయి.

Published : 27 Mar 2023 17:01 IST

వివాహం తర్వాత మహిళలకు జీవితంలో అత్యంత కీలకమైనది, మధురానుభూతిని ఇచ్చేది గర్భాధారణ దశ. ఈ దశలో తల్లి, బిడ్డ ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. మహిళలకు ప్రసూతి కోసం కవరేజీని అందించే ఆరోగ్య బీమా అవసరమైన సమయంలో తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రసవానంతరం కూడా తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆరోగ్య బీమా ఉపయోగపడుతుంది. అయితే, పాలసీని కొనుగోలు చేసే ముందు వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అనేక సాధారణ ఆరోగ్య బీమా ప్లాన్‌లు ప్రసూతి, డెలివరీ ఖర్చులకు కవరేజీని అందిస్తాయి. కాబట్టి, చాలావరకు ప్రత్యేక మెటర్నిటీ బీమా పాలసీకి వెళ్లాల్సిన అవసరం లేదు.

డెలివరీ ఖర్చులు

ప్రసూతి ఛార్జీలు అత్యంత కీలకమైనవి. ప్రసూతి రకాన్ని(సాధారణ/సి-సెక్షన్‌) బట్టి ఛార్జీలు మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలు వీటిని పూర్తిగా కవర్ చేస్తున్నాయి. అయితే, కొంత వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉంది. కంపెనీని బట్టి 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండొచ్చు. కాబట్టి, ప్రసూతి కోసం ప్లాన్ చేసే వాళ్లు కనీసం 3-4 ఏళ్ళ ముందే తగిన పాలసీని ఎంచుకోవడం మేలు.

నవజాత శిశువుకూ కవరేజీ

అనేక ఆరోగ్య బీమా పాలసీలు ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండానే నవజాత శిశువుల వైద్య ఖర్చులను కవర్‌ చేస్తాయి. ఇటువంటి కవర్‌ సాధారణంగా శిశువు పుట్టిన 91వ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అయితే, కొన్ని బీమా పాలసీల్లో పుట్టిన మొదటి రోజు/16వ రోజు నుంచి కూడా శిశువు వైద్య ఖర్చులను కవర్‌ చేస్తాయి. దీనివల్ల అప్పుడే పుట్టినవారికి కూడా వైద్య సహాయం తక్షణమే అందుబాటులోకి వస్తుంది.

ప్రసవానికి ముందు, తర్వాత

మహిళల ఆరోగ్య ప్రాముఖ్యత దృష్ట్యా అనేక బీమా పథకాలు ప్రసవానికి ముందు, తర్వాత చికిత్సలను కవర్‌ చేస్తాయి. స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందించే కొన్ని బీమా పాలసీలు గర్భధారణ నిర్ధారణ తర్వాత, ప్రసవానంతరం తల్లి, బిడ్డల వైద్య చికిత్స ఖర్చులకు కవరేజీని అందిస్తాయి.

గర్భాశయ పిండ శస్త్రచికిత్స

కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు అందించే ఆకర్షణీయమైన ప్రయోజనాల్లో ఇది ఒకటి. పుట్టుకతో వచ్చే లోపాలతో ఉన్న పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గర్భాశయంలోని పిండానికి శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. స్టార్‌ ఉమెన్‌ కేర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఈ సర్జరీ కోసం వెయిటింగ్‌ పీరియడ్‌తో కవర్‌ అందిస్తుంది. అయితే, నవజాత శిశువుకు సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాలకు చికిత్స చేయడానికి వెయిటింగ్‌ పీరియడ్‌ వర్తించదు.

ఇతర బీమా కవరేజీలు

కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు సంతానోత్పత్తి కోసం సహాయక పునరుత్పత్తి చికిత్సలకు కవరేజీని అందిస్తున్నాయి. మహిళలకు స్వచ్ఛంద స్టెరిలైజేషన్‌ (ట్యూబెక్టమీ) ఖర్చులను కూడా కవర్‌ చేస్తాయి. స్టార్‌ ఉమెన్‌ కేర్‌ బీమా పాలసీలో 22 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వివాహిత మహిళలకు ఈ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వెయిటింగ్‌ పీరియడ్‌ వర్తిస్తుంది. కొన్ని ఆరోగ్య బీమా పథకాలు శిశువులకు 12 నెలల వరకు వ్యాక్సినేషన్‌ ఖర్చులను కవర్‌ చేస్తాయి. అంతేకాకుండా నవజాత శిశువుల కోసం ఆసుపత్రి ఖర్చులైన గది అద్దె, ఐసీయూ, డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఛార్జీలు మొదలైన వాటిని కవర్‌ చేస్తాయి. ఒక్కోసారి అనుకోని ప్రమాదాల వల్ల జరిగే గర్భస్రావాల చికిత్స ఖర్చులను కూడా కవర్‌ చేస్తాయి.

చివరిగా: భారత్‌లో తల్లీబిడ్డల ఆరోగ్యం గతంలో కన్నా ప్రస్తుతం మెరుగయ్యింది. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తాజా నివేదిక ప్రకారం 2018-2020లో ప్రసూతి మరణాల రేటు 97కు తగ్గింది. ఇది గతంతో పోలిస్తే గణనీయమైన మెరుగుదల. గర్భధారణ సమయానికి ముందే సమగ్ర ఆరోగ్య బీమా కలిగి ఉండడం వల్ల మహిళల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని