Elon Musk: నా కొడుకు జీనియస్‌.. మస్క్‌ తల్లి కామెంట్

మస్క్‌ సాధిస్తున్న విజయాలు నచ్చిన వ్యక్తులే ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆయన తల్లి మయే మస్క్‌ అన్నారు. మరోవైపు ట్విటర్‌ ప్రమోషన్‌ కోసం మస్క్‌ అబద్ధాలు చెబుతున్నారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

Published : 14 Nov 2022 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ కొనుగోలు తర్వాత మస్క్‌ నిర్ణయాలు ఖాతాదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్‌కు ఆయన తల్లి మయే మస్క్‌ అండగా నిలిచారు. మస్క్‌ తెలివైన వాడు, అతడిపై విమర్శలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.  మస్క్‌ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేనివారే అతడిపై విమర్శలు చేస్తున్నారని మయే అభిప్రాయపడ్డారు. ట్విటర్‌ను మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కంపెనీలోని సెక్యూరిటీ, ప్రైవసీ విభాగాల్లో పనిచేసే కీలక ఉద్యోగులతో కలిపి మొత్తం 50 శాతం మంది ఉద్యోగులను తొలగించడం, ఆ తర్వాత 8 డాలర్లు చెల్లించి ఎవరైనా తమ ఖాతాలకు బ్లూటిక్ పొందొచ్చని పేర్కొనడం వంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కొన్ని నకిలీ ఖాతాలు సైతం బ్లూటిక్‌ తీసుకుని తప్పుడు ట్వీట్లు చేయడంతో పలు కంపెనీలకు నష్టం వాటిల్లింది.  

మస్క్‌ చెప్పేవన్నీ అబద్ధాలు.. ట్విటర్‌ మాజీ ఉద్యోగి ఆరోపణ

మరోవైపు ట్విటర్‌ ప్రమోషన్స్‌ గురించి మస్క్‌ చేసిన ట్వీట్‌పై నెటిజన్లతోపాటు, కంపెనీ మాజీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ట్విటర్‌ ద్వారా వెబ్‌సైట్లు/యాప్‌లకు క్లిక్స్‌ పెరుగుతున్నాయి. ఇంటర్నెట్‌లో  ఇదే అతిపెద్ద క్లిక్ డ్రైవ్‌’’ అని మస్క్‌ట్వీట్‌ చేశారు. దీనిపై ట్విటర్‌ మాజీ ఉద్యోగి సహా పలువురు నెటిజన్లు స్పందించారు. ‘‘మస్క్‌ చెప్పేవన్నీ అబద్ధాలే, ఈ విషయం ట్విటర్‌ యజమాన్యానికి కూడా తెలుసు. నేను ఐదేళ్లపాటు ట్విటర్‌లో పనిచేశాను. మస్క్‌ చెప్పేది వందశాతం అబద్ధం. ట్విటర్‌ ఎప్పుడు క్లిక్స్‌ను అమ్ముకోదు. ఎందుకంటే ఫేస్‌బుక్‌, లింక్డ్‌ఇన్‌ కంటే ట్విటర్‌కు ట్రాఫిక్‌ తక్కువే.  ట్విటర్‌కు వేరే బలాలున్నాయి. క్లిక్స్‌ కంటే మార్కెటింగ్ ముఖ్యం’’ అని ట్వీట్ చేశారు. మరో నెటిజన్‌ ట్వీట్ చేస్తూ మార్కెటింగ్ పరంగా ట్విటర్ గొప్ప టూల్‌ ఏమీ కాదని అన్నారు.

ట్విటర్‌ను లాభాల్లోకి తీసుకురావాలని మస్క్ తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా లాభాలు పొందాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఉద్యోగులకు రాసిన లేఖలో క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది కష్టపడి పనిచేయాలని.. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడాలని కోరినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని