McKinsey Layoffs: కొనసాగుతున్న తొలగింపులు.. మెకిన్సీలో 2000 మందికి ఉద్వాసన!

McKinsey Layoffs: కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మెకిన్సీ తమ సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉంది.

Published : 22 Feb 2023 11:37 IST

వాషింగ్టన్‌: కంపెనీలకు ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రణాళికను అందించే ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సీ అండ్‌ కంపెనీ (McKinsey & Co) సైతం స్వయంగా తమ సిబ్బందిని తగ్గించుకునే (Layoffs) యోచనలో ఉంది. దాదాపు 2,000 మందిని తొలగించేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

తమ క్లయింట్లతో నేరుగా సంబంధం ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకిన్సీ (McKinsey & Co) ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతోద్యోగులు తెలిపారు. గత దశాబ్ద కాలంలో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్థికంగా అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో సిబ్బందిని పునర్‌వ్యవస్థీకరించాలని యోచిస్తోంది. వచ్చే 2-3 వారాల్లో తొలగింపుల ప్రణాళికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

2012లో మెకిన్సీలో 17,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఐదేళ్ల క్రితం నాటికి ఆ సంఖ్య 28,000కు చేరింది. ఇప్పుడు అది 45,000గా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, క్లయింట్లతో నేరుగా పనిచేసే నిపుణుల నియామక ప్రక్రియ మాత్రం ఆగబోదని కంపెనీలోని ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. 2021లో కంపెనీ ఆదాయం 15 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2022 ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఫైనాన్స్‌ నుంచి టెక్నాలజీ, రిటైల్‌ వరకు అన్ని రంగాల్లోని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నాయి. అయితే, టెక్‌ రంగంలో తొలగింపులు అత్యధికంగా ఉన్నాయి. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా వంటి పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపాయి. మోర్గాన్‌ స్టాన్లీ, గోల్డ్‌మన్‌ శాక్స్‌ వంటి బడా ఆర్థిక సంస్థలు సైతం సిబ్బందిని తగ్గించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని