McLaren Artura: 3 సెకన్లలో 100 కి.మీ వేగం.. ₹ 5 కోట్లు హైబ్రిడ్ కారు ప్రత్యేకతలివే!

మెక్‌లారెన్‌ (McLaren) కంపెనీ తన తొలి హైబ్రిడ్ లగ్జరీ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో నాలుగు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు సరికొత డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయని కంపెనీ చెబుతోంది. 

Published : 26 May 2023 20:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటిష్‌ లగ్జరీ సూపర్‌ కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్‌ (McLaren) మరో కొత్త హైబ్రిడ్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మెక్‌లారెన్‌ ఆర్టురా (McLaren Artura)పేరుతో కంపెనీ ఈ కారును పరిచయం చేసింది. ఇది మెక్‌లారెన్‌ కంపెనీ ఉత్పత్తి చేసిన తొలి హైబ్రిడ్ లగ్జరీ సూపర్‌ కారు. భారత మార్కెట్‌లో ఈ కారు ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹ 5.1 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. మెక్‌లారెన్‌ ఆర్టురాలో 3.0 లీటర్ల ట్విన్‌-టర్బో హైబ్రిడ్‌ V6 పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఈ ఇంజిన్‌ 8-స్పీడ్‌ ఆటో ట్రాన్స్‌మిషన్‌తో 671 బీహెచ్‌పీ శక్తిని, 720 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆర్టురా అత్యధికంగా 330 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. కేవలం మూడు సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని, 8.3 సెకన్లలో 0-200 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. 

మెక్‌లారెన్‌ ఆర్టురాలో 8- అంగుళాల మెక్‌లారెన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్-2 ఇస్తున్నారు. ఇది యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్‌ చేస్తుంది. ఈ కారులో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ టెక్నాలజీ ఉంది. ఇందులో మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఈ-మోడ్‌, కంఫర్ట్‌, స్పోర్ట్‌, ట్రాక్‌. ఈ-మోడ్‌లో కారు ఎలక్ట్రిక్‌ మోటార్‌ సాయంతో వెళ్తుంది. కంఫర్ట్‌ మోడ్‌లో V6 పెట్రోల్‌ ఇంజిన్‌తోపాటు ఎలక్ట్రిక్‌ మోటార్‌తో కలిసి ఎక్కువ మైలేజ్‌ ఇస్తుంది. స్పోర్ట్‌ మోడ్‌లో డ్రైవర్‌ యాక్సలరేషన్‌ తక్కువ ఇచ్చినా.. ఎలక్ట్రిక్‌ మోటార్‌ కారు వేగానికి అవసరమైన పవర్‌ను అందిస్తుంది. ఇక ట్రాక్‌ మోడ్‌లో హైబ్రిడ్‌ పవర్‌ సాయంతో త్వరగా వేగాన్ని అందుకోవచ్చు. హైబ్రిడ్ పవర్‌ కోసం ఇందులో 7.4 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. దీని సాయంతో 31 కి.మీ ప్రయాణించవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని