లిస్టింగ్‌లో 30 శాతం గెయిన్స్ అందించిన మెడ్‌ప్ల‌స్ హెల్త్ స‌ర్వీసెస్‌

దేశీయ‌ రెండో అతిపెద్ద ఫార్మసీ రిటైలర్ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ 30.65 శాతం ప్రీమియంతో గురువారం లిస్ట్ అయ్యింది. ఈ స్టాక్ షేరు బీఎస్ఈలో రూ.1015 వ‌ద్ద‌, నేష‌న‌ల్  స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,040 వద్ద ప్రారంభమైంది.

Updated : 23 Dec 2021 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ‌ రెండో అతిపెద్ద ఫార్మసీ రిటైలర్ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ 30.65 శాతం ప్రీమియంతో గురువారం లిస్ట్ అయ్యింది. ఈ స్టాక్ షేరు బీఎస్ఈలో రూ.1015 వ‌ద్ద‌, నేష‌న‌ల్  స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,040 వద్ద ప్రారంభమైంది. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ. 796 కంటే రూ.219 (27.51 శాతం) పెరిగింది. లిస్టింగ్‌లో మెడ్‌ప్లస్ హెల్త్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,109.53 కోట్లుగా ఉంది.

మెడ్‌ప్ల‌స్ హెల్త్ స‌ర్వీసెస్‌ ఐపీఓ పెట్టుబడిదారుల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. డిసెంబర్ 13-15 మధ్యకాలంలో దాదాపు 53 రెట్ల బిడ్ల‌ను ఆక‌ర్షించ‌గా.. క్వాలిఫైడ్ సంస్థాగత మదుపరుల నుంచి 112 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 85 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. రిటైల్ పెట్టుబడిదారులు, ఉద్యోగుల కోసం రిజర్వు చేసిన భాగం వరుసగా 5.23, 3.05 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.

ఫార్మసీ రిటైలర్ తన పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ద్వారా రూ.1,398 కోట్లను సమీకరించింది. తాజాగా రూ.600 కోట్ల ఇష్యూని సాధించింది. ఇది దాని అనుబంధ సంస్థ ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించ‌నుంది.

నవంబర్ 2006లో హైదరాబాద్‌లో స్థాపించిన మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, ప్ర‌స్తుతం 2000 స్టోర్ల నెట్‌వ‌ర్క్‌తో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల‌లో విస్త‌రించింది. ఈ సంస్థ‌ ఫిజికల్ స్టోర్‌ల ద్వారా మాత్ర‌మే కాకుండా ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా త‌న కార్య‌కాలాపాల‌ను నిర్వ‌హిస్తోంది. 2021లో ఫిజిక‌ల్ స్టోర్ల ద్వారా 91 శాతం, ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా 9 శాతం విక్ర‌యాలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని