ONDC: ప్రభుత్వ ఇ-కామర్స్‌ వేదికపైకి మీషో

ప్రభుత్వ ఇ-కామర్స్‌గా పేర్కొనే ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ వేదికపైకి మీషో వచ్చి చేరింది. అటు కొనుగోలుదారులకు, ఇటు మారుమూల ప్రాంతాల్లో ఉండే విక్రయదారులకు ఉపయుక్తంగా ఉండేందుకు ప్రభుత్వం ఓఎన్‌డీసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Published : 23 Nov 2022 18:26 IST

దిల్లీ: ప్రభుత్వ ఇ-కామర్స్‌గా పేర్కొనే ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ONDC- Open Network for Digital Commerce) వేదికపైకి మీషో వచ్చి చేరింది. అటు కొనుగోలుదారులకు, ఇటు మారుమూల ప్రాంతాల్లో ఉండే విక్రయదారులకు ఉపయుక్తంగా ఉండేందుకు ప్రభుత్వం ఓఎన్‌డీసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మీషో తాజాగా భాగస్వామి అయ్యింది. ప్రస్తుతం బెంగళూరులో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఇది అందుబాటులోకి రాగా.. మరికొన్ని నెలల్లో ఇతర ప్రాంతాల్లోనూ మీషో సేవలు లభించనున్నాయి.

మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న వ్యాపారులకూ ఓ వేదిక ఉండాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఓఎన్‌డీసీలో చేరుతున్నట్లు మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్‌ ఆత్రేయ తెలిపారు. దేశ ఇ-కామర్స్‌ వ్యాపారాన్ని వినియోగదారులకు మరింత చేరువ చేయడంలో ఓఎన్‌డీసీ కీలక భూమిక పోషించబోతోందని చెప్పారు. భారత్‌లో ఇప్పటికీ ఈ-కామర్స్‌ వ్యాపారం పరిమితంగానే ఉందని, మీషో వంటి వేదికలు భాగస్వామ్యంతో ఓఎన్‌డీసీ ఓ పెద్ద నెట్‌వర్క్‌గా అవతరించబోతోందని ఓఎన్‌డీసీ సీఈఓ కోషి అన్నారు.

ఓఎన్‌డీసీ గురించి..

దేశీయ ఇ-కామర్స్‌ విపణిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌దే హవా. కొవిడ్‌ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరాణ షాపుల భవితవ్యం అనిశ్చితిలో పడుతోందని గుర్తించిన కేంద్రం.. చిన్న దుకాణదారులు కూడా ఆన్‌లైన్‌లో విక్రయాలు నిర్వహించడానికి వీలుగా ఓ వేదిక ఉండాలని సంకల్పించింది. ప్రధాని మోదీ సూచన మేరకు నందన్‌ నీలేకని, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం ఓఎన్‌డీసీ పేరిట లాభాపేక్షలేని ఈ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ వేదిక ప్రయోగ దశలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని