Kanika Tekriwal: క్యాన్సర్‌తో పోరాడి.. కంపెనీ పెట్టి.. రూ.420కోట్లు సంపాదించి..!

‘‘చిన్న పట్టణంలో పెద్ద పెద్ద కలలు కనే అమ్మాయి’’.. ఇన్‌స్టాగ్రామ్‌లో కనికా టెక్రివాల్‌ తన గురించి రాసుకున్నారిలా. కానీ, నిజ జీవితంలో ఆమె అంతకంటే ఎక్కువే. రెక్కలు కట్టుకుని ఎగరాలనే కల నెరవేరకపోయినా..

Updated : 29 Jul 2022 16:05 IST

32ఏళ్లకే సంపన్న మహిళగా ఎదిగిన కనికా టెక్రివాల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘చిన్న పట్టణంలో పెద్ద పెద్ద కలలు కనే అమ్మాయి’’.. ఇన్‌స్టాగ్రామ్‌లో కనికా టెక్రివాల్‌ తన గురించి రాసుకున్నారిలా. కానీ, నిజ జీవితంలో ఆమె అంతకంటే ఎక్కువే. రెక్కలు కట్టుకుని ఎగరాలనే కల నెరవేరకపోయినా.. గాల్లో ఎగిరే విమానాల కంపెనీకి అధినేత్రి అయ్యింది. 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో పోరాడి.. 22 ఏళ్లకు సొంతంగా కంపెనీ పెట్టింది. స్వశక్తితో 32ఏళ్లకు రూ.420కోట్ల సంపాదించి దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన సంపన్నురాలిగా అరుదైన గుర్తింపు సాధించింది. కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌-హురున్‌ విడుదల చేసిన టాప్‌ 100 ధనిక మహిళల్లో తొలిసారి చోటు దక్కించుకున్న కనికా ప్రయాణం గురించి తెలుసుకుందాం..

పైలట్‌ అవ్వాలనుకుని..

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ఓ మార్వాడి కుటుంబంలో కనికా జన్మించారు. ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువగా పాటించే వారి కుటుంబంలో అమ్మాయిలు ఉద్యోగాలు చేసేందుకు ఒప్పుకునేవారు కాదంట. కానీ, కనికాకు చిన్నప్పటి నుంచి పైలట్‌ అవ్వాలని విపరీతమైన కోరిక. ఇదే విషయం ఇంట్లో చెబితే ససేమిరా అన్నారు. దీంతో చేసేదేం లేక, తన కలను పక్కనబెట్టి డిజైనింగ్‌ రంగాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ఇంట్లో వాళ్లని ఒప్పించి ముంబయి చేరుకున్నారు. అక్కడ ఓ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న సమయంలో విమానయాన రంగంపై తన ఆసక్తి గురించి కనికా తన బాస్‌కు చెప్పారు. ఆయన ప్రోత్సహించడంతో 16 ఏళ్ల వయసులో లండన్‌ వెళ్లి ఏవియేషన్‌ కోర్స్‌లో చేరారు.

క్యాన్సర్‌ అని తెలిసినా కుంగిపోలేదు..

కానీ, మనమొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అంటారు కదా. లండన్‌లో చదువుకునే సమయంలో కనికా క్యాన్సర్‌ బారినపడ్డారు. దీంతో అక్కడ ఉండలేక తిరిగి భారత్‌కు వచ్చేశారు. ఏడాది పాటు ఎన్నో చికిత్సలు తీసుకుని, మనోధైర్యంతో క్యాన్సర్‌ను జయించారు. ఆ వ్యాధితో పోరాడుతున్న సమయంలోనే ప్రైవేటు విమానయానాలపై ఆమె ఆలోచన పడింది. ప్రైవేటు జెట్లలో ప్రయాణించాలనుకునేవారు బ్రోకర్లు లేదా ఆపరేటర్లను కలిసినప్పుడు వారు భారీ మొత్తంలో డబ్బులు, కమిషన్లు తీసుకుని విమానాలు అద్దెకు ఇచ్చేవారు. అంతేగానీ, ప్రయాణికుల ఇతర అవసరాలతో వారికి పనిలేదు.     అంటే.. ప్రైవేటు విమానయానం అనేది లగ్జరీ మాత్రమేగాక, కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని అందరికీ అందుబాటు ధరల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కనికా ఓ కొత్త ఆలోచన చేశారు. దానికి రూపమే ‘జెట్‌సెట్‌గో’.

తొలి విమానమే టేకాఫ్‌ అవలేదు..

ప్రైవేటు జెట్లలో సౌకర్యంగా ప్రయాణించాలనుకునేవారి కోసం కనికా తొలుత 2012లో ‘జెట్‌సెట్‌గో’ పేరుతో సొంతంగా ఓ ఏవియేషన్ అగ్రిగేటర్‌ సర్వీసెస్‌ సంస్థను ప్రారంభించారు. ప్రైవేటు జెట్‌ యజమానులు తమ ఆన్‌లైన్‌ వేదికపై లిస్ట్‌ చేసుకుంటే అక్కడి నుంచి కస్టమర్లు విమానాలు బుక్‌ చేసుకునే సర్వీసు ఇది. అంటే అచ్చంగా ఓలా, ఉబర్‌ లాంటిదన్నమాట. ఈ కంపెనీ ద్వారా ఎయిర్‌ టాక్సీ సేవలను అందించాలని ఆమె అనుకున్నారు. అయితే ప్రారంభంలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ కంపెనీ నుంచి తొలి విమాన సర్వీసును షెడ్యూల్‌ చేయగా.. పైలట్ రాకపోవడంతో ఆ విమానం టేకాఫ్‌ అవలేదు. అలా ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆమె ఉన్నడూ అధైర్యపడలేదు. ఆ తర్వాత సొంతంగా విమానాలు కొనుగోలు చేసి అద్దెకివ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. అలా 10 ఏళ్లలోనే వ్యాపారాన్ని ఎన్నో రెట్లు వృద్ధి చేశారు. ప్రైవేటు జెట్లు, ఛార్టెడ్‌ విమానాలను నిర్వహించే తొలి భారత కంపెనీ ఈమెదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సంస్థకు 10 ప్రైవేటు జెట్లు ఉన్నాయి.

టీ ఇవ్వడానికి వచ్చావా? అని అడిగారు..

కనికా ఈ స్థాయిలో రావడం అంత సులభమేం కాలేదు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ‘‘మేం కంపెనీ కోసం యాప్‌ ప్రారంభించిన కొత్తలో ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. నాకు ఇప్పటికీ ఓ సంఘటన గుర్తుంది. నా తొలి సేల్స్‌ మీటింగ్‌ అది. ఆ రోజు నేను ఓ పెద్ద కాన్ఫరెన్స్‌ గదిలోకి వెళ్లేసరికి అప్పటికే చాలా మంది పెద్దపెద్ద వాళ్లు అక్కడ కూర్చున్నారు. అందులో ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. టీ, కాఫీలు ఇవ్వడానికి వచ్చావా ? అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా ఏడుపొచ్చింది. కానీ ధైర్యాన్ని కూడగట్టుకుని నేను ఎందుకు అక్కడకు వచ్చానో స్పష్టంగా చెప్పాను’’ అని నాటి సంగతులను ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు కనికా.

ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మస్థైర్యం, స్వీయ ప్రేరణతోనే తాను వాటిని అధిగమించానని కనికా చెబుతుంటారు. ఈ సంస్థ ఇప్పుడు లక్ష మందికి పైగా కస్టమర్లకు సేవలందిస్తోంది. వీరిలో ఎక్కువ మంది రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలే. అన్నట్లు ఈ ఏడాదే కనికాకు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని