Recession: లోదుస్తులు.. ఆర్థిక మాంద్యం.. వీటి మధ్య ఉన్న లింకేంటి?

Recession: దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అంచనా వేయడానికి పురుషుల లోదుస్తుల విక్రయాలు సంకేతాలు ఇస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం..

Updated : 05 Apr 2023 13:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకదేశ ఆర్థిక వ్యవస్థ (Economy)ను అంచనా వేయడానికి అనేక కొలమానాలు అందుబాటులో ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయాదాయం, వృద్ధి రేటు, ప్రజల కొనుగోలు శక్తి.. ఇలా చాలా మార్గాల ద్వారా ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అంచనా వేయొచ్చు. ఒక దేశం ఆర్థికంగా పురోగమిస్తుందా లేదా తిరోగమన దిశలో పయనిస్తుందా తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం. అయితే, పురుషుల లోదుస్తుల విక్రయాలు కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ (Economy) తీరుతెన్నులను బహిర్గతం చేస్తుందట. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమేనంటున్నారు నిపుణులు!

ఎలాగంటే..

దీన్ని తొలిసారి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మాజీ ఛైర్మన్‌ అలెన్‌ గ్రీన్‌స్పాన్‌ సూత్రీకరించారు. పురుషుల లోదుస్తులు ఆర్థిక వ్యవస్థ (Economy) అంచనాకు చాలా కీలకమైన అంశమని ఆయన పేర్కొన్నారు. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు పురుషులు తమ లోదుస్తుల కొనుగోలును వాయిదా వేసుకుంటారట! వెంటనే పాతవాటిని మార్చడానికి అంతగా ఇష్టపడరని ఆయన వివరణ ఇచ్చారు. అదే రాబోయే ఆర్థికమాంద్యాన్ని (Recession) సూచిస్తుందని తెలిపారు.

భారత్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కలవరానికి గురిచేసింది. అయినప్పటికీ.. లోదుస్తుల విక్రయాలు మాత్రం దెబ్బతినలేదు. కానీ, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి పరిస్థితులు మారాయి. జాకీ, లక్స్‌ పేరిట లోదుస్తులను విక్రయిస్తున్న పేజ్‌ ఇండస్ట్రీస్‌ విక్రయాలు 11 శాతం పడిపోయాయి. ఈ కంపెనీ స్టాక్‌ విలువ ఐదు శాతం కుంగింది. రూప అండ్‌ కంపెనీ అమ్మకాల్లో 55 శాతం క్షీణత నమోదైంది. గత ఏడాది వ్యవధిలో రూప స్టాక్‌ విలువ 52 శాతం తగ్గింది. ఇలా వరుసగా పురుషుల లోదుస్తుల విక్రయాలు క్షీణిస్తే అలెన్‌ థియరీ ప్రకారం.. ఆర్థిక వ్యవస్థ (Economy)లో ఇబ్బందులు ఉన్నాయని అర్థం.

ఈ సూచీలూ అలాంటివే..

ఇదే తరహాలో లిప్‌స్టిక్‌ ఇండెక్స్‌ అని కూడా ఓ సూచీ ఉంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖరీదైన అలంకరణ వస్తువుల కొనుగోలును ఆడవాళ్లు వాయిదా వేసుకుంటారట! వాటి స్థానాన్ని ఆకర్షణీయమైన లిప్‌స్టిక్‌ల ద్వారా భర్తీ చేసుకుంటారని ఆర్థిక నిపుణుల భావన! అంటే ఆర్థిక మాంద్యం (Recession) ముంచుకొచ్చే ముందు లిప్‌స్టిక్‌ల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయట. దీన్ని లియోనార్డ్‌ లాడర్‌ అనే వ్యాపారవేత్త సూత్రీకరించారు. 2000లో వచ్చిన ఆర్థిక మందగమన సమయంలో లిప్‌స్టిక్‌ విక్రయాలు గణనీయంగా పెరగడం దానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. అయితే, 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ఇది తప్పని తేలింది. ఆర్థిక మాంద్యం ముదిరిన కొద్దీ లిప్‌స్టిక్‌ విక్రయాలు పడిపోయాయి. దీంతో లిప్‌స్టిక్‌ ఇండెక్స్‌ ఆర్థిక వ్యవస్థ (Economy)ను అంచనా వేయడానికి ఇక ఏమాత్రం ఆధారం కాదని పలువురు నిపుణులు కొట్టిపారేశారు. అయితే, మహిళలు నెయిల్‌ పాలిష్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే లిప్‌స్టిక్‌ ఇండెక్స్‌ అంచనాలు తప్పాయని మరికొందరు వాదించారు. ఆ క్రమంలో ‘నెయిల్‌ పాలిష్‌ ఇండెక్స్‌’ను కూడా తెరపైకి తెచ్చారు. మరోవైపు కరోనా సమయంలో ‘మాస్కారా ఇండెక్స్‌’ అని కొత్త సూచీ వినిపించింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం చాలా మంది మాస్కులు ధరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో కళ్లు మాత్రమే బయటకు కనిపిస్తుండడంతో వాటికి సంబంధించిన అలంకరణ వస్తువుల విక్రయాలు పెరిగాయట.

తొలి సంకేతాలు..

ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ (Economy)కు సంబంధించిన కచ్చితమైన గణాంకాలను వెలువరించనప్పటికీ.. ప్రాథమిక సంకేతాలు మాత్రం చెబుతాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని లోతైన అధ్యయనం జరపడానికి ఇవి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు. అంటే ఇవి ఒక ‘ట్రిగ్గర్‌ పాయింట్‌’లా పనిచేస్తాయని వారి విశ్వాసం. 2009 ఆర్థిక మాంద్యం (Recession) సమయంలో అమెరికాలో 2007 నుంచే పురుషుల లోదుస్తుల విక్రయాలు గణనీయంగా పడిపోయాయట. తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభం అయ్యాక 2010లో మళ్లీ విక్రయాలు పెరిగాయట. మరోవైపు కరోనాకు ముందు 2019లో అగ్రరాజ్యంలో ఆరు బిలియన్‌ డాలర్లు విలువ చేసే లోదుస్తులు విక్రయాలు జరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2020 నాటికి అవి 4.5 బిలియన్‌ డాలర్లకు కుంగాయి. దాదాపు 25 శాతం పడిపోయాయి. అదే 2021లో తిరిగి 22 శాతం పుంజుకొని 5.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

ద్రవ్యోల్బణాన్ని నివారించడం కోసం గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ కీలక వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంతో ఆర్థిక వృద్ధి కుంటుపడుతూ వస్తోంది. 2023లో మూడోవంతు దేశాలు ఆర్థిక మాంద్యం (Recession)లోకి జారుకుంటాయని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ అంచనా వేసింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తే దాన్ని మాంద్యంగా వ్యవహరిస్తారు. అయితే, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ (Economy) మాత్రం బలంగా ఉంటుందని ఇప్పటికే పలు నివేదికలు ఉద్ఘాటించాయి. కానీ, ఆర్‌బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాన్ని గమనిస్తే.. భారత్‌కు సైతం కొన్ని ఇబ్బందులు తప్పవనే విషయం స్పష్టమవుతోంది. మరి ఇటీవల భారత్‌లో తగ్గిన లోదుస్తుల విక్రయాలు అందుకు సంకేతమా? చూడాల్సి ఉంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని