Mercedes Benz C Class: సరికొత్తగా మెర్సిడెస్‌ బెంజ్‌ సి క్లాస్‌ @ ₹55 లక్షలు

మెర్సిడెస్‌ బెంజ్‌ తమ సి-క్లాస్‌ సెడాన్‌ను సరికొత్తగా తీర్చిదిద్ది మంగళవారం విడుదల చేసింది....

Published : 10 May 2022 20:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెర్సిడెస్‌ బెంజ్‌ తమ సి-క్లాస్‌ సెడాన్‌ను సరికొత్తగా తీర్చిదిద్ది మంగళవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.55 లక్షలు. డిజైన్‌ పరంగా లోపల, బయట ఇది బెంజ్‌ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ ఎస్‌-క్లాస్‌ను పోలి ఉంది. తొలిసారి ఇందులో మధ్యస్థాయి హైబ్రిడ్‌ పవర్‌ట్రైన్‌ను ఇస్తుండడం విశేషం.

2 డీజిల్‌, ఒక పెట్రోల్‌ ఇంజిన్‌..

* మెర్సిడెజ్‌ బెంజ్‌ కొత్త సి-క్లాస్‌ కార్లను రెండు డీజిల్‌, ఒక పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంట్రీ లెవెల్‌ సీ200 పెట్రోల్‌ వేరియంట్‌ 1.5 లీటర్‌, 4-సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 300 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ వద్ద 204 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

* సి-క్లాస్ డీజిల్‌ వేరియంట్‌ సీ220డీ ట్రిమ్‌తో ప్రారంభమవుతోంది. దీని ధర రూ.56 లక్షలు. ఇది 440 ఎన్‌ఎం టార్క్ వద్ద 200 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంట్లోనే టాప్‌ ట్రిమ్‌ సీ300డీ 440 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 265హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీని ధర రూ.61 లక్షలు.

* సీ200, సీ220డీ మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. సీ300 మాత్రం మూడు రంగుల్లోనే రానుంది.

* అన్ని ఇంజిన్లు 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌కు అనుసంధానించారు. సీ200 లీటరుకు 16.9 కి.మీ, సీ220డీ లీటరుకు 23 కి.మీ మైలేజీని ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు వేరియంట్లు 7.3 సెకన్లలో 100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటాయని పేర్కొంది. అదే సీ300 మాత్రం 5.7 సెకన్లలోనే ఆ వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.

డిజైన్‌..

ఈ కొత్త సి-క్లాస్‌ సెడాన్‌ డిజైన్‌ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏ-క్లాస్‌, ఈ-క్లాస్‌, ఎస్‌-క్లాస్‌లను పోలి ఉంటుందని కంపెనీ తెలిపింది. చిన్న ఓవర్‌హ్యాంగ్స్‌, పెద్ద యాంగులర్‌ ఫ్రంట్‌ ఎండ్‌, కొత్త హెడ్‌ల్యాంప్‌, టెయిల్ ల్యాంప్‌ డిజైన్లు ఉన్నట్లు పేర్కొంది. లోపల, బయట కొత్త హంగుల్ని చేర్చినట్లు తెలిపింది.

ఇంటీరియర్స్‌..

11.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌, రెండో తరం ఎంబీయూఎక్స్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌, వాయిస్‌ అసిస్టెంట్‌ అనుసంధానం వంటి ఫీచర్లు ఉన్నాయి. వ్యక్తిగత సమాచార యాక్సెస్‌కు వేలిముద్రలు, వాయిస్‌తో కూడిన బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ను ఇచ్చారు. స్క్రీన్‌ని కొద్దిగా డ్రైవర్‌ వైపు మలిపి ఉంచారు. గేర్‌ షిఫ్టర్‌, రోటరీ డయల్‌ను తొలగించారు. ఇన్ఫోటైన్‌మెంట్‌ ఫంక్షన్లను స్టీరింగ్‌ వీల్‌పై ఉండే టచ్‌ప్యాడ్‌తోనే కంట్రోల్‌ చేయొచ్చు. డ్యుయల్‌ జోన్ క్లైమేట్‌ కంట్రోల్‌, డ్యుయల్-పేన్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, పవర్డ్‌ ఫ్రంట్‌ సీట్ల వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని