Mercedes-Benz: మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల విక్రయాల్లో 28% వృద్ధి

Mercedes-Benz: కొత్త మోడళ్ల విడుదల, కొవిడ్‌ అనంతర గిరాకీ, పండగ సీజన్ నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయని మెర్సిడెస్‌ బెంజ్‌ తెలిపింది.

Published : 12 Oct 2022 17:12 IST

దిల్లీ: జనవరి-సెప్టెంబరు మధ్య మెర్సిడెస్‌ బెంజ్‌ విక్రయాలు భారత్‌లో 28 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. 2021 మొత్తం అమ్మకాల కంటే కూడా ఇది అధికం. ఈ తొమ్మిది నెలల్లో 11,469 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. క్రితం ఏడాది ఇదే సమయంలో 8,958 వాహనాలు అమ్ముడైనట్లు పేర్కొంది. తమ విక్రయాలు కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకున్నట్లు తెలిపింది. ఈ వేగం ఇలాగే కొనసాగితే అత్యధిక విక్రయాలు ఈ సంవత్సరంలోనే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. 2021లో మెర్సిడెస్‌ బెంజ్‌ 11,242 వాహనాలను విక్రయించింది.

గిరాకీకి అనుగుణంగా కార్లను అందించలేకపోయినప్పటికీ.. విక్రయాలు గణనీయంగా పుంజుకున్నాయని కంపెనీ తెలిపింది. కొత్త మోడళ్ల విడుదల, కొవిడ్‌ అనంతర గిరాకీ, పండగ సీజన్ నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. సెప్టెంబరు నాటికి కంపెనీ వద్ద 7,000 యూనిట్లకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. ఈ-క్లాస్‌ మోడల్‌కు అత్యధిక గిరాకీ ఉన్నట్లు తెలిపింది. జీఎల్‌ఎస్‌ మేబ్యాచ్‌ 600, మేబ్యాచ్‌ ఎస్‌-క్లాస్‌ మోడళ్లకు సైతం మంచి ఆదరణ ఉందని పేర్కొంది. మరోవైపు తమ తొలి విద్యుత్తు సెడాన్‌ ఈక్యూఎస్‌ 580 డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. కొత్తగా బుక్‌ చేసుకున్నవారికి 2023 ఆరంభంలో కార్లను అందిస్తామని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని