Meta: కోత మొదలు పెట్టిన మెటా.. 11 వేల మందికి ఉద్వాసన!

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా (Meta) అనుకున్నట్లుగానే ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీలో పనిచేస్తున్న 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది.

Updated : 09 Nov 2022 17:56 IST

వాషింగ్టన్‌: ఊహించిందే జరిగింది. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా (Meta) అనుకున్నట్లుగానే ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీలో పనిచేస్తున్న 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను 13 శాతం మేర తగ్గించుకుంటున్నట్లు మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ బుధవారం ప్రకటించారు.

ఉద్యోగుల తొలగింపు విషయాన్ని మెటా చరిత్రలో కఠినమైన రోజుగా జుకర్‌బర్గ్‌ అభివర్ణించారు. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు చెప్పారు. అలాగే, కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామన్నారు. వచ్చే ఏడాది  తొలి త్రైమాసికం వరకు నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.  ప్రకటనల ఆదాయం తగ్గడం వల్ల ఆదాయంపై ప్రభావం పడిందని, దీంతో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనంతటికీ తనదే బాధ్యత అని పేర్కొన్న మార్క్‌..  తొలగింపునకు గురైన ఉద్యోగులకు ఈ సందర్భంగా క్షమాపణ చెప్పారు.

2004లో ఫేస్‌బుక్‌ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలను తొలగించడం ఇదే తొలిసారి. డిజిటల్‌ ప్రకటనల ఆదాయం తగ్గుముఖం పట్టడం, మాంద్యం భయాలు వెంటాడుతున్న వేళ మెటా నుంచి ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. ప్రస్తుతం మెటాలో సుమారు 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ సైతం సగం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. మరోవైపు సిలికాన్‌వ్యాలీకి చెందిన ఇతర కంపెనీలు సైతం నియామకాలను తగ్గించుకోవాలని ఇప్పటికే నిర్ణయించాయి.

16 వారాల వేతనం

కంపెనీ నుంచి ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఆ మేరకు ఈ-మెయిల్‌ వస్తుందని జుకర్‌బర్గ్‌ తెలిపారు. వారి కంప్యూటర్లకు యాక్సెస్‌ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే తొలగింపునకు గురైన ఉద్యోగులకు 16 వారాల వేతనం లభిస్తుందని చెప్పారు. కంపెనీలో పనిచేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల చొప్పున అదనపు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే తొలగించిన ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు ఆరు నెలల వరకు ఆరోగ్య బీమా కొనసాగుతుందని  జుకర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని