Meta India: మెటా ఇండియా నుంచి మరో ఎగ్జిట్‌.. 6 నెలల్లో నలుగురు!

మెటా ఇండియాకు మరొకరు రాజీనామా చేశారు. ఆ కంపెనీ డైరెక్టర్‌ అయిన మనీశ్‌ చోప్రా తన పదవికి రాజీనామా చేశారు. ఆరు నెలల వ్యవధిలో నలుగురు కీలక వ్యక్తులు మెటా నుంచి వైదొలగడం గమనార్హం.

Published : 17 May 2023 23:02 IST

దిల్లీ: మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని మెటాకు (meta) భారత్‌లో షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ కంపెనీకి చెందిన డైరెక్టర్‌, పార్టనర్‌షిప్స్‌ హెడ్‌ మనీశ్‌ చోప్రా (Manish Chopra) మెటాకు గుడ్‌బై చెప్పారు. 2019 జనవరిలో మెటాలో చేరిన ఆయన.. నాలుగేళ్ల అనంతరం కంపెనీని వీడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా లింక్డిన్‌ పోస్ట్‌లో తెలియజేశారు. వృత్తి జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆయన రాజీనామాను మెటా సైతం ధ్రువీకరించింది. అయితే, ఇతర వివరాలు ఏవీ వెల్లడించలేదు.

మెటా ఇండియాలో గత కొన్ని రోజులుగా వరుస రాజీనామాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది నవంబర్‌లో మెటా ఇండియా ఇండియా హెడ్‌ అజిత్‌ మోహన్‌ కంపెనీకి గుడ్‌బై చెప్పి స్నాప్‌లో చేరారు. ఆ స్థానంలోకి సంధ్య దేవనాథన్‌ వచ్చారు. ఆమె మెటా హెడ్‌గా నియమితులయ్యే వరకు చోప్రానే తాత్కాలిక హెడ్‌గా వ్యవహరించారు. మోహన్‌ రాజీనామా అనంతరం వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌, కొద్ది రోజులకు మెటా ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ రాజీవ్‌ అగర్వాల్‌ సైతం కంపెనీని వీడారు. ఈ క్రమంలోనే మనీశ్‌ చోప్రా రాజీనామా సైతం చోటుచేసుకుంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మెటా ఇండియాలో కీలక పదవుల్లో ఉన్న నలుగురు వ్యక్తులు కంపెనీని వీడడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 సెప్టెంబర్‌లో వాట్సాప్‌ పే ఇండియా చీఫ్‌ మనీశ్‌ మహాత్మే తన పదవికి రాజీనామా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు