Instagram: ఇన్‌స్టాలో బ్రాడ్‌కాస్ట్‌ ఛానెల్‌ ఓపెన్‌ చేశారా..?

ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో యూజర్ల కోసం మెటా (Meta) సంస్థ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా కంటెంట్ క్రియేటర్లు (Content Creators) తమ ఫాలోవర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవచ్చు. 

Published : 18 Feb 2023 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటెంట్‌ క్రియేటర్ల (Content Creators) కోసం ఫొటో/వీడియో షేరింగ్ సోషల్‌ మీడియా (Social Media) యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. బ్రాడ్‌కాస్ట్‌ ఛానెల్స్‌ (Broadcast Channels) ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా (Meta) సీఈవో మార్క్‌ జుకర్‌బర్క్‌ (Mark Zuckerberg) తెలిపారు. ముందుగా ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఛానెల్స్‌ (Instagram Channels) పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా సంస్థ వెల్లడించింది.

ఈ ఫీచర్‌తో కంటెంట్‌ క్రియేటర్లు తమ ఫాలోవర్ల సమాచారాన్ని సులువుగా షేర్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు తమ సొంత ఛానెల్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత అందులో ఫొటో, వాయిస్‌ నోట్స్‌, పోలింగ్‌ నిర్వహణ, అభిప్రాయ సేకరణ చేయొచ్చు. ఛానెల్‌ రూపొందించిన వ్యక్తి మాత్రమే ఇందులో పోస్ట్‌లు చేయగలరు. ఫాలోవర్లు ఆ పోస్టులకు తమ స్పందన తెలియజేయగలరని ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలోని యూజర్లతో పరీక్షిస్తున్నట్లు మెటా తెలిపింది. త్వరలో అన్ని ప్రాంతాల్లోని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

ఛానెల్‌  ఎలా పనిచేస్తుంది?

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఛానెల్స్‌ క్రియేట్ చేసిన తర్వాత వారిని అనుసరించే వారికి నోటిఫికేషన్‌ వెళ్తుంది. ఆసక్తిగల ఫాలోవర్లు నోటిఫికేషన్‌పై క్లిక్ చేస్తే జాయిన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఛానెల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఛానెల్‌లో చేరొచ్చు. తర్వాత ఛానెల్‌ క్రియేట్ చేసిన వ్యక్తి అందులో మెసేజ్‌, పోల్‌, ఫీడ్‌బ్యాక్‌కు సంబంధించి ఏవైనా పోస్ట్‌ పెట్టగానే ఫాలోవర్లకు అలర్ట్‌ నోటిఫికేషన్ వస్తుంది. వాటిపై క్లిక్ చేసి తమ స్పందన తెలియజేయొచ్చు. ఫాలోవర్లు ఎప్పుడైనా ఛానెల్‌ నుంచి బయటికి రావచ్చు. అందులో పోస్ట్‌ చేసే సమాచారం అభ్యంతరకరంగా గానీ, అనుమానాస్పదంగా ఉంటే ఫాలోవర్లు ఛానెల్‌పై ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేయొచ్చు. రాబోయే కొద్ది నెలల్లో ఛానెల్స్‌ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌, మెసేంజర్‌లో కూడా పరిచయం చేస్తామని మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని