Meta Layoffs: భారత్‌లో ఉన్నతోద్యోగులకూ మెటా ఉద్వాసన!

Meta Layoffs: 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మార్చిలో మెటా ప్రకటించింది. అందులో భాగంగా గత నెలలో 4 వేల మందిని, తాజాగా మరో 6 వేల మందిని ఇంటికి పంపింది.

Updated : 26 May 2023 15:17 IST

Meta Layoffs | న్యూయార్క్‌: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ ఉద్యోగుల తొలగింపు (Meta Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా మరో 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు మార్చిలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

దాదాపు 10 వేల మందికి ఉద్వాసన (Meta Layoffs) పలుకుతామని మార్చిలోనే మెటా ప్రకటించింది. వీటిని ఏప్రిల్‌, మేలో రెండు విడతలుగా చేపడతామని వెల్లడించింది. అందుకనుగుణంగానే ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపింది. మిగిలిన ఆరు వేల మందిని తాజాగా తొలగించింది. మార్కెటింగ్‌, సైట్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంజినీరింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ సహా చాలా విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇంజీనిరింగ్‌యేతర విభాగాల్లో అత్యధిక తొలగింపులు ఉన్నట్లు సమాచారం. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

తొలగింపుల్లో భాగంగా భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులనూ మెటా (Meta Layoffs) ఇంటికి పంపింది. పింక్‌ స్లిప్స్‌ అందుకున్న వారిలో భారత్‌లో పలువురు ఉన్నతోద్యోగులు ఉన్నట్లు సమాచారం. మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్ అవినాశ్‌ పంత్‌, మీడియా పార్ట్‌నర్‌షిప్స్‌ డైరెక్టర్‌ సాకేత్‌ ఝా సౌరభ్‌ సైతం ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇలా భారత్‌లో మార్కెటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, మానవ వనరుల విభాగాల్లో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు.

ఫస్ట్‌ రిపబ్లిక్‌లో 1000 మందికి జేపీ మోర్గాన్‌ ఉద్వాసన..

ఇటీవల దివాలా తీసిన ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌లో 15 శాతానికి సమానమైన 1,000 మందిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు జేపీ మోర్గాన్‌ చేజ్‌ ప్రకటించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు 60 రోజుల వేతనంతో పాటు ఏకమొత్తంలో కొంత నగదును పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ దివాలా తీయడంతో దాన్ని జేపీ మోర్గాన్‌ చేజ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అలీబాబాలో 15 వేల నియామకాలు..

ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే చైనాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా మాత్రం భారీ ఎత్తున కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. మొత్తం ఆరు విభాగాల్లో 15 వేల మందిని విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది. వీరిలో 3,000 మంది ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నవారిని తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు అలీబాబా ఉద్యోగులను తొలగించనున్నట్లు వస్తున్న వార్తలను కంపెనీ ఖండించింది. అయితే, అలీబాబా క్లౌడ్‌ డివిజన్‌ మాత్రం 7 శాతం ఉద్యోగులను తొలగించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని