H-1B visa: మెటాలో ఉద్యోగాల తొలగింపు.. హెచ్‌1బి వీసాదారుల మాటేంటి?

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. 11 వేల మందికి ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఒకవేళ తొలగించిన వారిలో హెచ్‌1బి వీసాపై ఉద్యోగాలు చేస్తున్నవారు ఉంటే వారి పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Published : 09 Nov 2022 20:24 IST

న్యూయార్క్‌: ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. 11 వేల మందికి ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఒకవేళ తొలగించిన వారిలో హెచ్‌1బి వీసాపై ఉద్యోగాలు చేస్తున్నవారు ఉంటే వారి పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. హెచ్‌1బి వీసాపై భారత్‌, చైనా నుంచి ఎక్కువ మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటారు. అక్కడి టెక్‌ కంపెనీలు ఈ వీసాపై వర్కర్లను నియమించుకుంటూ ఉంటాయి. సాధారణంగా హెచ్‌1బి వీసా ద్వారా అమెరికాలో మూడేళ్లు ఉద్యోగం చేయొచ్చు. ఆపై మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న కంపెనీలో ఉద్యోగం పోతే 60 రోజుల పాటు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈలోగా కొత్త ఉద్యోగాన్ని అన్వేషించుకోవాల్సి ఉంటుంది. కొత్త కంపెనీ హెచ్‌1బి వీసాను స్పాన్సర్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా వీసా పొందకపోతే అమెరికాను వీడాల్సి ఉంటుంది.

మెటా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించనుందన్న సమాచారం ముందే బయటకొచ్చింది. దీంతో పెద్ద ఎత్తున హెచ్‌1బి వీసా కలిగిన వారిపై ప్రభావం పడనుందని వార్తలు వచ్చాయి. ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో జుకర్‌బర్గ్‌ దీనిపై స్పందించారు. ఉద్వాసన పలికిన ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్‌ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ‘‘ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వీసాదారులకు ఇబ్బంది కలిగించేదే. అయినా, ఉద్యోగం నుంచి పూర్తి వైదొలగడానికి ముందు కొంత నోటీస్‌ పీరియడ్‌ ఉంటుంది. అలానే వీసా గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. ఆ సమయంలో ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఉద్యోగులకు వీలు పడుతుంది. ఈ విషయంలో మీకు, మీ కుటుంబానికి సహకారం అందించేందుకు ఇమ్మిగ్రేషన్‌ స్పెషలిస్టులను అందుబాటులో ఉంచుతున్నాం’’ అని జుకర్‌బర్గ్‌ తెలిపారు. అలాగే తొలగించిన ఉద్యోగులకు 16 వారాల వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. కంపెనీలో పనిచేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల చొప్పున అదనపు వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే తొలగించిన ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు ఆరు నెలల వరకు ఆరోగ్య బీమా కొనసాగుతుందని జుకర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని