Updated : 04 Feb 2022 12:52 IST

Mark Zuckerberg: ఒకేరోజు రూ.2.2 లక్షల కోట్లు పోగొట్టుకున్న జుకర్‌బర్గ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో కంపెనీ షేరు విలువ గత రెండు రోజుల్లో భారీగా కుంగింది. గురువారం ఏకంగా 26.39 శాతం దిగజారి నాస్డాక్‌లో 237.76 డాలర్ల వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 200 బిలియన్‌ డాలర్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ 661.39 బిలియన్‌ డాలర్లకు చేరింది.

దీంతో కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపదలో భారీ తరుగుదల నమోదైంది. ఫోర్బ్స్‌ రియల్‌-టైం బిలియనీర్స్‌ జాబితా ప్రకారం.. ఆయన సంపద గురువారం ఒక్కరోజే 29.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.2 లక్షల కోట్లు) ఆవిరైపోయింది. ప్రస్తుతం 84.8 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6.3 లక్షల కోట్లు)తో ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్‌బర్గ్‌ 12వ స్థానానికి చేరారు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం.. ప్రస్తుతం భారత కుబేరులైన ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ సైతం జుకర్‌బర్గ్‌ కంటే ముందున్నారు.

ఒక్కరోజులో ఈ స్థాయి సంపదను కోల్పోయిన రెండో వ్యక్తి జుకర్‌బర్గ్‌. గత నవంబరులో టెస్లాలో తనకున్న షేర్లలో 10 శాతం వాటాలను అమ్మకానికి ఉంచనున్నట్లు ప్రకటించడంతో కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్‌ సంపద ఒకే రోజు 35 బిలియన్ డాలర్లు పతనమైంది. అప్పటి కుంగుబాటు నుంచి కంపెనీ షేర్లు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు.


బెజోస్‌ సంపద మరింత పైకి

మరోవైపు గురువారం వెలువడిన అమెజాన్‌ త్రైమాసిక ఫలితాలు మదుపర్లను ఉత్సాహపరిచాయి. విద్యుత్తు వాహన తయారీ సంస్థ రివియాన్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి పరిణామాలు కంపెనీ ఫలితాలను సానుకూలంగా ప్రభావితం చేశాయి. మరోవైపు అమెరికాలో అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వ రుసుమును పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో గురువారం కంపెనీ షేరు విలువ 15 శాతానికి పైగా ఎగబాకింది. ఫలితంగా కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ సంపద 20 బిలియన్ డాలర్ల (రూ.1.4 లక్షల కోట్లు) మేర పెరిగింది. ఫోర్బ్స్‌ జాబితాలో 164.8 బిలియన్‌ డాలర్లతో ప్రస్తుతం బెజోస్‌ 3వ స్థానంలో ఉన్నారు. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని