Meta: మెటాలో ‘టిక్’ చేయాలంటే డబ్బు చెల్లించాల్సిందే!
గతంలో బ్లూ టిక్ వెరిఫికేషన్ (Blue Tick Verification)ను వార్తా సంస్థలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్లు, సెలబ్రిటీలు, రాజకీయనాయకుల ఖాతాలకు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను సడలించారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ (Twitter) సీఈవోగా ఎలాన్ మస్క్ (Elon Musk) బాధ్యతలు చేపట్టిన తర్వాత వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్ (Blue Tick Verification)ను సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. నెలవారీ రుసుము చెల్లించి యూజర్లు తమ ఖాతాకు బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందొచ్చు. తాజాగా ఇదే విధానాన్ని మరో సోషల్ మీడియా (Social Media) దిగ్గజం మెటా (Meta)కూడా తీసుకొచ్చింది. మెటాకు చెందిన ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్లు ఎవరైనా తమ సోషల్ మీడియా ఖాతాలకు బ్లూ టిక్ పొందొచ్చు. గతంలో ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను వార్తా సంస్థలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఖాతాలకు మాత్రమే ఇచ్చేవారు. ఇందుకోసం వారు సోషల్ మీడియా సంస్థలకు కొన్ని వివరాలు సమర్పించేవారు. వాటి ఆధారంగా ఖాతాలకు బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను సడలించారు. నెలవారీ రుసుము చెల్లించి ఎవరైనా బ్లూ టిక్ పొందొచ్చు.
ప్రస్తుతం మెటా బ్లూ టిక్ ఫీచర్ అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వెబ్ వెర్షన్‌కు నెలకు 11.99 డాలర్లు (సుమారు రూ. 990), మొబైల్ యాప్ వెర్షన్‌కు 14.99 డాలర్లు (సుమారు రూ.1230) చెల్లించాలి. వెబ్ వెర్షన్‌కు నగదు చెల్లించిన యూజర్లకు కేవలం ఫేస్‌బుక్‌కు మాత్రమే బ్లూ టిక్ కనిపిస్తుంది. మొబైల్ వెర్షన్ యూజర్లకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల రెండింటికి బ్లూ టిక్ కనిపిస్తుంది. వీటితోపాటు కస్టమర్ సపోర్ట్ డైరెక్ట్ యాక్సెస్, ప్రత్యేకమైన స్టిక్కర్స్, నెలకు 100 స్టార్‌లను అదనంగా పొందుతారు. ఈ స్టార్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేసేవారికి మద్దతుగా ఇతరులు వర్చువల్ గిఫ్ట్‌లుగా పంపుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ పొందాలంటే యూజర్ వయస్సు 18 సంవత్సరాలు దాటాలి. ఇప్పటికే బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందిన వారు అదనంగా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరంలేదు. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఇతర దేశాల్లోని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.