Mutual Funds: 5 నెలల్లో 70 లక్షల మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఆస్తుల నిర్వహణ సంస్థల వద్ద 70 లక్షల కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు నమోదయ్యాయి....

Published : 25 Sep 2022 16:50 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఆస్తుల నిర్వహణ సంస్థల (AMC) వద్ద 70 లక్షల కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funs-MF) ఖాతాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 13.65 కోట్లకు చేరింది. డిజిటల్‌ సాధనాలు అందుబాటులోకి రావడం, మ్యూచువల్‌ ఫండ్లపై అవగాహన పెరగడమే భారీ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (Amfi)’ గణాంకాల ప్రకారం.. 2021-22లో కొత్తగా 3.17 కోట్లు, 2020-21లో 81 లక్షల ఖాతాలు నమోదయ్యాయి.

ఈ స్థాయిలో ఎంఎఫ్‌ ఖాతాలు పెరగడం ఈక్విటీ మార్కెట్లలోకి కొత్త మదుపర్ల ప్రవేశాన్ని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. చాలా మంది ఎంఎఫ్‌లో మదుపునకు ప్రాధాన్యం ఇస్తున్నారని దీంతో తెలుస్తోందన్నారు. ‘‘నోట్ల రద్దు వల్ల ప్రజలు పొదుపును మదుపుగా మార్చుకోవడం ప్రారంభించారు. అది కరోనా మహమ్మారి సమయంలో ఊపందుకుంది. రిస్కు తీసుకోవడానికి ఈతరం యువకులు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. క్రమానుగత పెట్టుబడులు జీవితంలో ఒక భాగమైపోతున్నాయి. స్టాక్‌ మార్కెట్లు దీర్ఘకాలం లాభాల్లో ఉండడం.. ఈ కారణాలన్నింటి వల్ల ఎంఎఫ్‌లో మదుపు చేసేవారి సంఖ్య పెరుగుతోంది’’ అని మోతీలావ్‌ ఓస్వల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది తెలిపారు.

యాంఫీ లెక్కల ప్రకారం.. వివిధ ఫండ్‌ హౌస్‌ల వద్ద ఎంఎఫ్‌ ఖాతాల సంఖ్య ఆగస్టు 2022లో 13.65 కోట్లతో రికార్డు గరిష్ఠానికి చేరింది. మార్చి 2022లో అవి 12.95 కోట్లుగా నమోదయ్యాయి. 10 కోట్ల ఖాతాల మైలురాయి మే 2021లోనే దాటింది. కరోనా సంక్షోభం తర్వాత మార్కెట్లు బలంగా పుంజుకున్న విషయం తెలిసిందే. చాలా మంది ఈక్విటీ మదుపర్లు భారీ ఎత్తున లాభపడ్డారు. దీంతో ఎంఎఫ్‌లో పెట్టుబడులకు ఆదరణ పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని