MG Comet bookings: ఎంజీ కామెట్‌ బుకింగ్స్‌ ప్రారంభం.. రూ.11 వేలు చెల్లిస్తే చాలు!

MG Comet bookings | ఎంజీ వెబసైట్‌, ఎంజీ డీలర్‌షిప్‌లలో నేటి నుంచి కామెట్‌ విద్యుత్‌ కారును బుక్‌ చేసుకోవచ్చు.

Published : 15 May 2023 17:19 IST

MG Comet bookings | ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్ల తయారీ సంస్థ మోరిస్‌ గరాజస్‌ ఇండియా ఇటీవల విడుదల చేసిన కామెట్‌ విద్యుత్‌ కారుకు (MG Comet EV) బుకింగ్స్‌ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఎంజీ మోటార్‌ ఇండియా వెబ్‌సైట్‌, ఎంజీ డీలర్‌షిప్‌లలో ఇప్పుడు ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు. రూ.11,000 కనీస మొత్తం చెల్లించి ఆర్డర్‌ పెట్టొచ్చు. మీరు బుక్‌ చేసిన కారు స్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ‘ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌’ అనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మైఎంజీ యాప్‌’లో వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఎంజీ కామెట్‌ (MG Comet EV) మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.7.98 లక్షలు. బేస్‌ వేరియంట్‌ పేస్‌ (Pace) ధర రూ.7.98 లక్షలు కాగా.. ప్లే (Play) ధర రూ.9.28 లక్షలు, ప్లష్‌ (Plush) ధర రూ.9.98 లక్షలు(ఎక్స్‌ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరలు తొలి 5 వేల బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. మే 22 నుంచి దశలవారీగా కార్లను కస్టమర్లకు అందజేస్తామని ప్రకటించింది.

తక్కువ ధరలో విద్యుత్‌ కారును తీసుకొచ్చిన ఈ సంస్థ కామెట్‌ (MG Comet EV) వాహనంపై బైబ్యాక్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. మూడేళ్ల తర్వాత వాహనాన్ని వెనక్కిస్తే వాహన ఎక్స్‌షోరూమ్‌ ధరలో 60 శాతం సొమ్మును వెనక్కిస్తామని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు ఎంజీ ఇ-షీల్డ్‌ ఓనర్‌షిప్‌ ప్యాకేజీ కింద 3 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారెంటీ, మూడేళ్ల పాటు రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, 3 ఫ్రీ లేబర్‌ సర్వీసెస్‌, 8 ఏళ్లు లేదా 1.20 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారెంటీని కంపెనీ అందిస్తోంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 17.3kWh లిథియం ఐయాన్‌ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 230 కిలోమీటర్లు మేర ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. 0-100 శాతం ఛార్జింగ్‌కు 7 గంటల సమయం పడుతుంది. ఇందులో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం లేదు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం రూ.519 మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. మే నెలాఖరులో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని