MG Motor: ఎంజీ మోటార్‌లో వాటా విక్రయం.. రేసులో రిలయన్స్‌, హీరో గ్రూప్‌!

MG Motor India stake sale: ఎంజీ మోటార్‌ విక్రయించ తలపెట్టిన కార్లవ్యాపారం వాటాల కొనుగోలుకు పలు సంస్థలు పోటీపడుతున్నాయి. రిలయన్స్‌తో పాటు, హీరో, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి.

Published : 11 May 2023 17:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చైనాకు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ ఎంజీ మోటార్‌ (MG Motor) భారత్‌లోని తన అనుబంధ కంపెనీ ఎంజీ మోటార్‌ ఇండియాలో మెజారిటీ వాటాను విక్రయ ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందుకోసం దేశీయంగా కొనుగోలుదారుల కోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లుు తెలుస్తోంది. ఈ కొనుగోలు రేసులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries), హీరో గ్రూప్‌ (Hero group), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ (JSW group), ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ వంటివి ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా ఈ డీల్‌ పూర్తి చేయాలని ఎంజీ మోటార్‌ భావిస్తోంది.

భారతీయ భాగస్వాములకు మెజారిటీ వాటా విక్రయించడం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించే ప్రణాళికలో ఉన్నట్లు ఎమ్‌జీ మోటార్‌ ఇండియా బుధవారం పేర్కొంది. బ్రిటిష్‌ బ్రాండ్‌ అయిన ఎమ్‌జీ మోటార్‌.. ప్రస్తుతం చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్ప్‌ చేతిలో ఉంది. 2028 కల్లా మన దేశంలో కార్యకలాపాలను విస్తరించడం కోసం రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని సంస్థ భావిస్తోంది.

అయితే, చైనా మాతృ సంస్థ నుంచి మరింత మూలధనాన్ని సేకరించేందుకు ఎమ్‌జీ ఇండియా (MG Motor India) ప్రయత్నిస్తున్నా విజయవంతం కాలేదు. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ అనంతరం ఎఫ్‌డీఐ నిబంధనలను భారత్‌ కఠినతరం చేసింది. దీంతో రెండేళ్ల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) పొందేందుకు ప్రభుత్వ అనుమతుల కోసం చూస్తోంది. ఇవేవీ సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా మెజారిటీ వాటా విక్రయానికి ఎంజీ మోటార్‌ సిద్ధమైంది. వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో దేశంలో రెండో తయారీ ప్లాంటు నెలకొల్పాలని ఆ కంపెనీ భావిస్తోంది. తద్వారా వార్షిక సామర్థ్యాన్ని 3,00,000 వాహనాలకు చేర్చాలనుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు