Budget 2023: ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’కి కేటాయింపుల్లో కోత

Budget 2023: తాజా బడ్జెట్‌ 2023లో ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధి శాఖకు నిధుల కేటాయింపులను తగ్గించారు.

Updated : 01 Feb 2023 18:44 IST

దిల్లీ: గ్రామీణాభివృద్ధి శాఖ, ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాని (MGNREGS)’కి ఈ బడ్జెట్‌లో కేటాయింపులను కుదించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు ఈసారి రూ.1,57,545 కోట్లను కేటాయించారు. క్రితం బడ్జెట్‌తో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ.

MGNREGS పథకానికి కేటాయింపులను దాదాపు మూడోవంతు కుదించడం గమనార్హం. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. ఈ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. క్రితం బడ్జెట్‌లో దీనికి రూ.73,000 కోట్లు అలాట్‌ చేశారు. కానీ, సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది ఈ పథకానికి రూ.89,400 కోట్లు ఖర్చయ్యాయి. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం.. MGNREGS కింద ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకుంది. మహమ్మారి సంక్షోభం నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి చేరుకుందనడానికి ఇదే నిదర్శమని సర్వే పేర్కొంది.

2021-22లో MGNREGSకు రూ. 73,000 కోట్లు కేటాయించగా.. ఆ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రూ.98,467.85 కోట్లు ఖర్చు చేసింది. 2020-21లో రూ.1,11,169 కోట్లు ఈ పథకం కోసం ప్రభుత్వం వెచ్చించింది.

మరోవైపు ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనకు క్రితం బడ్జెట్‌ తరహాలోనే రూ. 19,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అలాగే నేషనల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌- అజీవికాకు కేటాయింపులను స్వల్పంగా పెంచి రూ.14,129.17 కోట్లకు చేర్చింది. పీఎం ఆవాస్‌ యోజనకు రూ.54,487 కోట్లు,  శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌కు రూ. 550 కోట్లు కేటాయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు