Micro finance: ఒకరికి రూ.2 లక్షలకు మించి అప్పు ఇవ్వొద్దు

సూక్ష్మ రుణ సంస్థలు (మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు) ఇష్టారాజ్యంగా రుణాలు జారీ చేయడం వల్ల, సాధారణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడకుండా.. మొండి బకాయిలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై పరిశ్రమ సంఘం ఎంఫిన్‌ (మైక్రో-ఫైనాన్స్‌ ఇండస్ట్రీ నెట్‌వర్క్‌) దృష్టి సారించింది.

Updated : 10 Jul 2024 07:04 IST

 4 కంపెనీల వరకే పరిమితం 
సూక్ష్మ రుణ సంస్థలకు ఎంఫిన్‌ మార్గదర్శకాలు 

కోల్‌కతా: సూక్ష్మ రుణ సంస్థలు (మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు) ఇష్టారాజ్యంగా రుణాలు జారీ చేయడం వల్ల, సాధారణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడకుండా.. మొండి బకాయిలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై పరిశ్రమ సంఘం ఎంఫిన్‌ (మైక్రో-ఫైనాన్స్‌ ఇండస్ట్రీ నెట్‌వర్క్‌) దృష్టి సారించింది. సూక్ష్మ రుణ సంస్థలకు సొంత నియంత్రణ వ్యవస్థగా ఎంఫిన్‌ పనిచేస్తోంది. అంటే, ఎంఫిన్‌ నిబంధనలను సూక్ష్మ రుణ సంస్థలు పాటించాల్సిందే. ఎంఫిన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సూక్ష్మ రుణ సంస్థలు ఒక వ్యక్తికి రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పుగా ఇవ్వరాదు. ఒక వ్యక్తికి 1నుంచి 4 సంస్థలు మాత్రమే రుణాలివ్వాలి. ఈ మొత్తం కలిపి రూ.2 లక్షలు మించకూడదు. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని ఎంఫిన్‌ స్పష్టం చేసింది. 

ఇవన్నీ గమనించాలి: సూక్ష్మ రుణాల తిరిగి చెల్లింపు వ్యవధి 18 - 24 నెలలు ఉంటుంది. తాజా పరిమితిని అమలు చేస్తే, రుణగ్రస్తులు అప్పుల భారంతో కుంగిపోకుండా కాపాడినట్లు అవుతుందని, సూక్ష్మ రుణ సంస్థలకూ బకాయిల భారం తగ్గుతుందని ఎంఫిన్‌ భావిస్తోంది. రుణాలు జారీ చేసే సమయంలో రుణగ్రస్తుడి ఆదాయం, ఖర్చులు, తిరిగి చెల్లించగల సామర్థ్యం.. తదితర అంశాలను సూక్ష్మ రుణ సంస్థలు తప్పనిసరిగా మదింపు చేయాలని సూచించింది. రుణ సమాచార సంస్థలు (క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ) తమ సమాచార నాణ్యతను బాగా పెంచుకోవాలని కోరింది. సూక్ష్మ రుణ సంస్థలు రుణాల మంజూరులో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరమని, తద్వారా ఈ పరిశ్రమ దీర్ఘకాలంలో స్థిరంగా మనుగడ సాగిస్తుందని ఎంఫిన్‌ పేర్కొంది. 

7.8 కోట్ల మంది రుణ గ్రహీతలు: దాదాపు రూ.3 లక్షల వార్షికాదాయం గల కుటుంబాలు సూక్ష్మ రుణ సంస్థలకు వినియోగదార్లుగా ఉంటున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ రంగం ఎంతగానో విస్తరించింది. ప్రస్తుతం సూక్ష్మ రుణాల పరిశ్రమకు 7.8 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నాయి. వీరికి జారీ చేసిన రుణాల మొత్తం రూ.4.33 లక్షల కోట్లకు మించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని