ChatGPT: చాట్‌జీపీటీలో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడి!

Microsoft-ChatGPT: గూగుల్‌కు గట్టి పోటీనిచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా చాట్‌జీపీటీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీతో చర్చలు జరుపుతోంది.

Published : 10 Jan 2023 14:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతిక యుగంలో సరికొత్త సంచలనం చాట్‌జీపీటీ (ChatGPT) మరోసారి వార్తల్లోకెక్కింది. దీని మాతృ సంస్థ ఓపెన్‌ఏఐలో (OpenAI) మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఆ కంపెనీలో 1 బిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్‌.. మరో 10 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై మైక్రోసాఫ్ట్‌ గానీ, ఓపెన్‌ ఏఐ గానీ స్పందించలేదు.

కంపెనీలోని ప్రస్తుతం ఉన్న షేర్‌ హోల్డర్ల షేర్లను విక్రయించాలని ఓపెన్‌ ఏఐ నిర్ణయించిందని గతంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. ఇందుకోసం కంపెనీ విలువను 29 బిలియన్‌ డాలర్లుగా లెక్కకట్టింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సహా కొన్ని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలతో ఓపెన్‌ ఏఐ సంస్థ చర్చలు జరుపుతోందని తెలిసింది. పెట్టుబడి కార్యరూపం దాల్చితే మైక్రోసాఫ్ట్‌కు 49 శాతం, ఇతరు ఇన్వెస్టర్లకు 49 శాతం వాటా దక్కే అవకాశం ఉందని కొన్ని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

ఏమిటీ చాట్‌జీపీటీ..?

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓపెన్‌ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ. 2015లో శామ్‌ ఆల్ట్‌మన్‌, ఎలాన్‌ మస్క్‌ కలసి 100 కోట్ల డాలర్లతో ఈ కంపెనీని ఆరంభించారు. 2018లో మస్క్‌ రాజీనామా చేశారు. అయినా పెట్టుబడులు మాత్రం పెడుతున్నారు. 2019లో మైక్రోసాఫ్ట్‌ కూడా ఇందులో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతానికి ఇదింకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఉచితంగా అందుబాటులోనే ఉంది. ఓపెన్‌ఏఐ.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకొని దీన్ని వినియోగించి చూడవచ్చు. మరోవైపు మైక్రోసాఫ్ట్‌ బింగ్‌లో ఏఐ తరహా ఫీచర్‌ను జోడించాలని ఆ కంపెనీ ఆలోచన. తద్వారా ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌కు పోటీనివ్వాలని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని