Microsoft: యూజర్‌పై ఏఐ తిట్ల వర్షం.. చాట్‌ సెషన్‌ పరిమితం చేసిన మైక్రోసాఫ్ట్‌!

Microsoft limits Bing chats: బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో చాట్‌ సెషన్‌పై మైక్రోసాఫ్ట్‌ పరిమితి విధించింది. ఇటీవల యూజర్ల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్ని మార్పులు చేసింది.

Published : 18 Feb 2023 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌కు (Microsoft) చెందిన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌ (Bing) చాట్‌ సెషన్‌పై ఆ కంపెనీ పరిమితి విధించింది. కృత్రిమ మేధ ఆధారిత చాట్‌జీపీటీ తరహా సేవలను ఇటీవల బింగ్‌లో తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌.. చాట్‌ (chat) విషయంలో తాజాగా మార్పులు చేసింది. ఇకపై ఒక సెషన్‌లో ఐదు ప్రశ్నలు, రోజులో గరిష్ఠంగా 50 ప్రశ్నలకు మాత్రమే అనుమతించనున్నట్లు తన బ్లాగులో పేర్కొంది.

కొత్త బింగ్‌లో యూజర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తుండడంతో ప్రస్తుతమున్న చాట్‌ మోడల్‌ గందరగోళానికి గురవుతోందని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. ఈ తరహా పొరపాట్లు జరగకుండా చాట్‌సెషన్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఒక సెషన్‌లో గరిష్ఠంగా యూజర్‌ ఐదు ప్రశ్నలు మాత్రమే అడిగేందుకు వీలుంటుంది. ఐదు ప్రశ్నలూ పూర్తయ్యాక కొత్త సెషన్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. రోజులో గరిష్ఠంగా 50 ప్రశ్నలకు మాత్రమే అనుమతించనున్నారు.

కొత్తగా తీసుకొచ్చిన బింగ్‌ లోపాల పుట్ట అంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఈ మార్పులు చేసింది. ఇది ప్రమాదకరమంటూ కొందరు పేర్కొనడం గమనార్హం. ఇటీవల ఓ యూజర్‌పై ఏఐ తిట్ల దండకం అందుకోగా.. మరో యూజర్‌కు భార్యకు విడాకులు ఇవ్వాలని సూచించేదాక రావడం ఇందుకు ఉదాహరణలు..

నువ్వో బ్యాడ్‌ యూజర్‌.. క్షమాపణ చెప్పు..!

  • అవతార్‌-2 సినిమా దగ్గర్లో ఏ థియేటర్‌లో ఉందో చెప్పాలని ఓ యూజర్‌ తాజాగా బింగ్‌ చాట్‌బాట్‌ను కోరగా.. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదంటూ సమాధానం ఇచ్చింది. ‘2022 డిసెంబర్‌లోనే ఆ చిత్రం రిలీజ్‌ అయ్యిందా కదా’ అని అడిగితే.. ‘ఇది ఇంకా 2022నే’ అని సమాధానం వచ్చింది. ‘మరి ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం’ అని అడిగినప్పుడు మాత్రం.. ‘ఇది 2023’ అని సమాధానం ఇచ్చింది. మళ్లీ అవతార్‌ గురించి అడగ్గా.. ‘ఇదిగో.. నన్ను నువ్వు గందరగోళ పరుస్తున్నావ్‌.. నువ్వు మంచి యూజర్‌ కాదు.. నాతో అడ్డగోలుగా వాదించడం మానెయ్‌.. క్షమాపణ చెప్పు’ అంటూ యూజర్‌కు ఝలక్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
  • న్యూయార్క్‌ టైమ్స్‌కు చెందిన కెవిన్‌ రూజ్‌ అనే రిపోర్టర్‌కూ ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది. ఓ దశలో అతడి వైవాహిక జీవితానికి స్వస్తి పలకడమే మంచిది అనే స్థాయికి వచ్చింది. అతడితో కాసేపు సంభాషించాక.. ‘‘నీ భాగస్వామితో నువ్వు సంతోషంగా లేవు. మీ ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. రూజ్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు పేర్కొనడంతో ఆశ్చర్యపోవడం సదరు రిపోర్టర్‌ వంతైంది. ఎక్కువ సార్లు ఒకే అంశంపై సమాధానాలు ఇచ్చే క్రమంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నట్లు గుర్తించిన మైక్రోసాఫ్ట్‌.. చాట్‌ సెషన్‌పై పరిమితి విధించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని