LinkedIn layoffs: లింక్డిన్‌నూ తాకిన లేఆఫ్‌ల సెగ!

LinkedIn layoffs: మైక్రోసాఫ్ట్‌కు చెందిన సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌లోనూ లేఆఫ్‌లు ప్రారంభమయ్యాయి. రిక్రూట్‌మెంట్‌ విభాగానికి చెందిన ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలిసింది.

Published : 14 Feb 2023 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పరంపర ఇంకా కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌లోనూ (LinkedIn) ఉద్వాసనల ప్రక్రియ మొదలైంది. రిక్రూట్‌మెంట్‌ విభాగానికి చెందిన ఉద్యోగుల్లో కొందరిని ఇంటికి పంపినట్లు తెలిసింది. మైక్రోసాఫ్ట్‌ ప్రకటించిన లేఆఫ్‌ల ప్రణాళికలో లింక్డిన్‌ కూడా చేరినట్లు తెలిసింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ది ఇన్ఫర్మేషన్‌ అనే వెబ్‌సైట్‌ కథనం రాసింది. ఎంతమందిని తొలగించిందీ అందులో పేర్కొనలేదు. దీనికి సంబంధించి లింక్డిన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా 10వేల మందిని తొలగించాలని మైక్రోసాఫ్ట్‌ నిర్ణయించింది. మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగిస్తున్నట్లు జనవరిలో వెల్లడించింది. అయితే, ఏ విభాగంలో ఎంతమందిని తొలగించేదీ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో లింక్డిన్‌లో తొలగింపులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవలే మైక్రోసాఫ్ట్‌కు చెందిన సియాటెల్‌ కార్యాలయంలో 600 మందిని తొలగించారు. ఈ క్రమంలోనే లింక్డిన్‌లో తొలగింపులు జరగడం గమనార్హం. ఇప్పటికే ట్విటర్‌, గూగుల్‌, అమెజాన్‌, మెటా వంటి పెద్ద పెద్ద టెక్‌ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని