Microsoft: 11,000 మందికి మైక్రోసాఫ్ట్‌ ఉద్వాసన.. నేటి నుంచే తొలగింపులు!

Microsoft: ఉద్యోగుల తొలగింపుల విషయంలో ట్విటర్‌, మెటా, అమెజాన్‌ వంటి సంస్థల బాటలోనే మైక్రోసాఫ్ట్‌ సైతం నడుస్తోంది. నేటి నుంచి ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం. 

Published : 18 Jan 2023 11:56 IST

వాషింగ్టన్‌: ఉద్యోగుల తొలగింపు (Lay offs) ప్రక్రియ కొత్త ఏడాదిలోనూ కొనసాగుతోంది. తాజాగా టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు(Lay offs) సిద్ధమైంది. మొత్తం సిబ్బందిలో ఐదు శాతానికి సమానమైన 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించడాని(Lay offs)కి సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ట్విటర్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా వంటి బడా టెక్‌ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే.

బుధవారం నుంచే మైక్రోసాఫ్ట్‌ (Microsoft)లో తొలగింపు (Lay offs) ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. మానవ వనరులు, ఇంజినీరింగ్‌ విభాగాల్లో అధికంగా తొలగింపులు (Lay offs) ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, మాంద్యం భయాలు బలపడుతున్న నేపథ్యంలో కంపెనీలన్నీ వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే.

వచ్చే రెండేళ్ల పాటు కంప్యూటర్‌ పరిశ్రమ తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్లు ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాలకు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సైతం అతీతమేమీ కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ సంస్థల్లో సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ పరోక్షంగా తొలగింపుల (Lay offs)పై సంకేతాలిచ్చారు. 

వ్యక్తిగత కంప్యూటర్ల పరిశ్రమలో కొన్ని త్రైమాసికాల నుంచి నిర్లిప్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఇది విండోస్‌ సహా మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఉత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు క్లౌడ్‌ వ్యాపారమైన అజూర్‌తో కంపెనీ వృద్ధిని కొనసాగించడం కష్టతరంగా మారింది. గత ఏడాది జులైలోనే కొంతమంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్‌ ఇంటికి పంపింది. అక్టోబరులోనూ సుమారు 1,000 మందికి ఉద్వాసన పలికింది.

గత ఏడాది జూన్‌ 30 నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌ ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌ (Microsoft)లో 2,21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1,22,000 మంది అమెరికాలో, 99,000 మంది ఇతర దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు వాషింగ్టన్‌ రాష్ట్రంలోని బెలెవూలో ఉన్న 26 అంతస్తుల సిటీ సెంటర్‌ ప్లాజాలోని కార్యాలయ లీజును మైక్రోసాఫ్ట్‌ (Microsoft) పునరుద్ధరించడం లేదని వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని