Microsoft: మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు.. సత్య నాదెళ్ల కీలక ప్రకటన!

మైక్రోసాప్ట్‌ అజ్యూర్‌ క్లౌడ్‌ సేవలు ఉపయోగించుకుంటున్న యూజర్లకు సత్య నాదెళ్ల గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ ఆధారిత సేవలకు అదనంగా మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

Updated : 17 Jan 2023 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొంతకాలంగా టెక్నాలజీ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం చాట్‌జీపీటీ (ChatGPT). సెర్చ్‌ ఇంజిన్‌ తరహాలో కృతిమమేధ (AI) ఆధారంగా పనిచేసే ఈ చాట్‌బాట్‌ (Chatbot)ను ఓపెన్‌ఏఐ (OpenAI) అనే సంస్థ అభివృద్ధి చేసింది. త్వరలో ఈ చాట్‌జీపీటీ సేవలను మైక్రోసాఫ్ట్ (Microsoft) యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. ‘‘త్వరలోనే చాట్‌జీపీటీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ ఓపెన్‌ఏఐ  (Azure OpenAI Services)సేవలను ఉపయోగించుకునే వారికి అందుబాటులోకి రానున్నాయి. దీంతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ యూజర్లు ప్రపంచంలోనే అత్యాధునికమైన ఏఐ సేవలను తమ వ్యాపారపరమైన అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కొద్దిరోజులుగా మైక్రోసాఫ్ట్ సంస్థ తన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌ (Bing)లో చాట్‌జీపీటీ సేవల పరిచయం చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల ప్రకటన చేయడంతో మరోసారి చాట్‌జీపీటీపై టెక్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌తోపాటు మైక్రోసాఫ్ట్ వర్డ్‌ (Microsoft Word), ఎక్సెల్‌ (Excel), పవర్‌పాయింట్‌ (Powerpoint) సాఫ్ట్‌వేర్‌లలో కూడా చాట్‌జీపీటీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ సంస్థ చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐలో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. తాజా ప్రకటనతో ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ జట్టు కట్టేందుకు సిద్దమైందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

సత్య నాదెళ్ల తాజా ప్రకటనతో రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌ సేవలు ఉపయోగించుకుంటున్న వారు చాట్‌జీపీటీ సేవలు అదనంగా పొందవచ్చు. అజ్యూర్‌ యూజర్లకు ఇప్పటికే GPT-3.5, DALL-E 2, Codex వంటి ఏఐ ఆధారిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చాట్‌జీపీటీ భద్రతపై కూడా మైక్రోసాఫ్ట్ ప్రకటన చేసింది. అసభ్య పదజాలం, హింసను ప్రేరేపించే సమాచారం, అసత్య వార్తలు వంటి వాటిని ఎప్పటికప్పుడు నిరోధించేలా కంపెనీ ఏఐ నియమనిబంధనలకు అనుగుణంగా అజ్యూర్‌ ఓపెన్‌ ఏఐ సర్వీస్‌లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఒకవేల యూజర్లు కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని