Published : 03 May 2022 13:31 IST

యువ‌త పెట్టుబ‌డుల‌కి స్టాక్స్ వైపే చూస్తున్నారా?

ప్రపంచ దేశాల‌న్నిటిలోనూ యువ‌త ఎక్కువున్న‌ది భార‌త‌దేశంలోనే. వీరు ఆయా వృత్తుల‌లోనే నిమ‌గ్న‌మ‌వ్వ‌డ‌మే కాకుండా పెట్టుబ‌డుల్లో కూడా ముందంజ‌లో ఉన్నారు. ముఖ్యంగా యువ‌త పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు లాభార్జ‌న ధ్యేయంగా ఉంటారు. సాంప్ర‌దాయ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు వీరిని పెద్ద‌గా ఆక‌ర్షించ‌వు. అధిక లాభాలే ధ్యేయంగా పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతారు. రిస్క్‌కు వెనుకాడ‌రు. న‌ష్టాలు వ‌చ్చినా త‌ట్టుకునే స‌మ‌యం, ఆరోగ్యం కూడా దీర్ఘ‌కాలం స‌హ‌క‌రిస్తుంది కాబ‌ట్టి ఈక్విటీ, స్టాక్ మార్కెట్ల‌ ను ఇష్టపడుతున్నారు. 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రంలో దేశంలోని `డీమ్యాట్‌` ఖాతాల సంఖ్య గ‌త 12 నెల‌ల్లో 63% పెరిగి దాదాపు 9 కోట్ల‌కు చేరుకుంది.

యువ‌త స్త్రీ, పురుష భేదం లేకుండా ఈక్విటీ ఫండ్స్‌, స్టాక్‌ల‌లో పెట్టుబ‌డి పెడుతున్నారు. ఫైనాన్షియ‌ల్ యాప్‌లు, ఇత‌ర సాంకేతిక సాధ‌నాల విస్తృత‌మైన ల‌భ్య‌త వ‌ల్ల ప‌రిశోధ‌న చేయ‌డానికి త‌గినవిధంగా వారికి అవ‌కాశం ల‌భించింది. త‌గిన మ్యూచువ‌ల్ ఫండ్‌లు, స్టాక్స్ ఎంచుకోవ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతున్నాయి. యువ‌త స్టాక్స్ విష‌యానికొస్తే పొదుపులా కాకుండా పెట్టుబ‌డిదారులుగా ఆలోచిస్తున్నారు. ఆర్ధిక మాంద్యం, ఉద్యోగ న‌ష్టాలు, వేత‌న కోత‌లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో యువ‌త భాగ‌స్వామ్యం పెర‌గ‌డం అనేది సానుకులాంశాల‌లో ఒక‌టి.

యువ‌త‌లో పెట్టుబ‌డిదారులు 2019 సంవ‌త్స‌రంలో దాదాపు 24 శాతం మ‌హిళ‌లే. ఇది 2020 సంవ‌త్స‌రానికొచ్చేస‌రికి 30 శాతానికి పెరిగింది. కొంత కాలం క్రితం స్థిరాస్తి రంగం తిరోగ‌మ‌నానికి దారితీయ‌డం, బ్యాంకుల‌లో వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డం మూలంగా పెట్టుబ‌డిదారులు ప్ర‌త్యామ్నాయ మార్కెట్లయిన ఈక్విటీల‌వైపు మొగ్గుచూపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో యువ‌త మ‌హిళ‌ల‌తో సహా స‌వాలుతో కూడిన ఆర్ధిక ప‌రిస్థితుల‌లో త‌మ జీవిత భాగ‌స్వాముల‌కు మ‌ద్ద‌తుగా ఈక్విటీ ఫండ్‌లు, స్టాక్‌ల‌లో పెట్టుబ‌డి పెడుతున్నారు. 2020 లాక్‌డౌన్ త‌ర్వాత ఎక్కువ మంది మ‌హిళ‌లు కూడా ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను ఎంచుకున్నార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ కోవిడ్ స‌మ‌యంలో సెన్సెక్స్‌, నిఫ్టీ 50 పెర‌గ‌డం కూడా యువ‌త ఈక్విటీల‌వైపు రావ‌డ‌మే కార‌ణ‌మ‌ని మార్కెట్ విశ్లేష‌కుల అభిప్రాయం.

చాలా మంది యువ మ‌హిళ‌లు లాక్‌డౌన్ అనంత‌రం ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను ఇష్ట‌ప‌డ్డారు. కొంత మంది స్టాక్‌ల కంటే మ్యూచువ‌ల్ ఫండ్స్‌కి తమ పెట్టుబ‌డుల‌ను త‌ర‌లించారు. సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ల‌తో పాటు చిన్న మొత్తాలను పెట్టుబ‌డి పెట్ట‌డానికి వీలుండే `డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌`ల‌ను ఇష్ట‌ప‌డ్డారు. 

స్వ‌ల్ప‌కాలంలో ఒక్కోసారి న‌ష్టాలొచ్చినా కూడా దీర్ఘకాలం పాటు ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించే రాబ‌డి ఆర్ధిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో స‌హాయ‌ప‌డుతుంద‌ని యువ‌త న‌మ్ముతున్నారు. అంతేకాకుండా ప్ర‌జ‌ల‌ జీవ‌న ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తే  పొదుపు, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఇంకా ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే కోవిడ్‌-19.. ఆక‌స్మిక పొదుపులు, పెట్టుబ‌డులు కీల‌కం అని ఒక ముఖ్య‌మైన పాఠం నేర్పింది.

చివరిగా:

యువత స్టాక్స్ లో మదుపు చేయడం మంచి పరిణామం అయినప్పటికీ స్టాక్ మార్కెట్ లో లాభాలు మాత్రమే ఉంటాయని ఆశించి రావడం సరైన పధ్ధతి కాదు. స్టాక్ మార్కెట్ అధిక లాభాలు ఇచ్చిన ప్రతి సారి యువత డీమ్యాట్ ఖాతాలు తెరిచి, అందులో అనుచితమైన పెట్టుబడులు పెట్టడం చూస్తూనే ఉన్నాము. సరైన అవగాహన తెచుకున్నాకే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలి, లేదంటే నష్టాలు చూడక తప్పదు. అవసరం అయితే ఆర్ధిక సలహాదారుల సలహాలు తీసుకోవచ్చు.       

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని