Quarterly Results: మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో ఐదొంతుల వృద్ధి

జనవరి-మార్చి త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఏకీకృత లాభాల్లో ఐదొంతుల వృద్ధి నమోదైంది....

Published : 28 May 2022 20:52 IST

ముంబయి: జనవరి-మార్చి త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఏకీకృత లాభాల్లో ఐదొంతుల వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.245 కోట్ల లాభం ఈసారి రూ.1,192 కోట్లకు ఎగబాకింది. ఆదాయం 28 శాతం పెరిగి రూ.17,124 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇది రూ.13,356 కోట్లుగా నమోదైంది.

2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.4,935 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మార్చి 31, 2021తో ముగిసిన ఏడాదిలో నమోదైన రూ.984 కోట్లతో పోలిస్తే ఈసారి లాభాలు భారీగా పెరగడం విశేషం. ఆటో, అగ్రి సెగ్మెంట్‌లో ఈసారి నమోదైన రూ.55,300 కోట్ల ఏకీకృత ఆదాయం కంపెనీ చరిత్రలోనే అత్యధికమని ఓ ప్రకటనలో తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 29 శాతం అధికమని వివరించింది.

ఆటో రంగంలో 42 శాతం వృద్ధితో విక్రయాలపరంగానూ మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు నమోదైందని కంపెనీ తెలిపింది. అలాగే ట్రాక్టర్ల మార్కెట్‌ వాటా సైతం 1.8 శాతం పెరిగి 40 శాతానికి చేరినట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల ఎగుమతులు సైతం 77 శాతం పెరిగాయని పేర్కొంది. ట్రాక్టర్ల ఎగుమతులు 66 శాతం పెరిగి 17,500 యూనిట్లకు చేరినట్లు తెలిపింది. చివరి త్రైమాసికంలో సెమీకండక్టర్ల లభ్యత పెరగడమే వాహన విక్రయాల పెరుగుదలకు దోహదం చేసిందని వివరించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో సాధారణ షేరుపై రూ.11.55 డివిడెండ్‌ ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు