Union Budget 2022: ఈ సారి ‘పంచ’తంత్రం బడ్జెట్‌ ..!

ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగడంతో దేశంలో రాజకీయ వేడి రాజుకొంది. అదే సమయంలో బడ్జెట్‌ రావడంతో మరింత రంజుగా మారనుంది. ఇక్కడి విజయాలు కేంద్రంలో అధికార భాజపా భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి.

Updated : 30 Jan 2022 13:39 IST

 ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఆచితూచి అడుగులు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగడంతో దేశంలో రాజకీయ వేడి రాజుకొంది. అదే సమయంలో బడ్జెట్‌ రావడంతో మరింత రంజుగా మారనుంది. ఇక్కడి విజయాలు కేంద్రంలో అధికార భాజపా భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత నుంచి జరిగిన ఎన్నికల్లో కమలం పార్టీ కొంత ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఓటములను జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. ‘ఎలక్షన్‌ విన్నింగ్‌ మెషిన్స్‌’గా పేరుగాంచిన భాజపా అధినాయకత్వానికి తాజాగా జరగనున్న ఐదురాష్ట్రాల ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 690 శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలితే 2024 ఎన్నికల నాటికి రాజ్యసభలో అధికార పక్షానికి సమస్యలు తలెత్తవచ్చు. రైతు ఉద్యమాలు, ధరల పెరుగుదల, కరోనా నియంత్రణ, నిరుద్యోగ సమస్యల ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉంది.  వచ్చే ఏడాది గుజరాత్‌, కర్ణాటక, మేఘాలయా, మిజోరాం, నాగాల్యాండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపురలో ఎన్నికలు జరగనున్నాయి. 2024లో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ బడ్జెట్‌ రాజకీయంగానూ అత్యంత కీలకంగా మారనుంది.

కటకటలాడుతోన్న ఆర్థిక పరిస్థితి..

2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయగా.. గతేడాదితో పోలిస్తే జీడీపీ వృద్ధిరేటు 9.2శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు. కానీ, ద్రవ్యోల్బణం 5.59శాతంగా ఉంది. చమురు ధర 90 డాలర్లకు చేరింది. నిరుద్యోగ శాతం 80శాతం పెరిగింది. భారత్‌లో విద్యావంతులు ఉన్న సంఘటిత రంగాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. కానీ, 90శాతం ఉపాధి అవకాశాలు అసంఘటిత రంగంలో ఉంటాయి. అదే సమయంలో జీడీపీలో దాదాపు సగం ఈ రంగం నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉద్యోగాలను పెంచడంపై కూడా దృష్టిపెట్టాలి.

సదుపాయాల కల్పనపై దృష్టి..

రైతు చట్టాలపై పంజాబ్‌, హరియాణా, పశ్చిమ యూపీలో రైతు వర్గాలు ఉద్యమించాయి. అదే సమయంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ చట్టాలను ఉపసంహరించుకొంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు మరో సారి దగ్గరయ్యేలా కేంద్రం బడ్జెట్‌-22ను సిద్ధం చేయవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన వంటి పథకాలకు ఈ సారి పదునుపెట్టవచ్చు. సరికొత్త పట్టణ ఉపాధి పథకాలను కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో పట్టణాల్లో కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో అర్హులైన వారికి కనీసం 180 రోజులు ఉపాధి ఉండేలా చర్యలు తీసుకోవచ్చు.

భారీగా కొత్త పథకాల జోలికి పోకుండానే ఉన్న పథకాలను బలోపేతం చేయవచ్చు. ముఖ్యంగా ఎన్నికలు ఉన్న ఐదు రాష్ట్రాల్లో రోడ్డు, రైల్వే, మౌలిక వసతుల ప్రాజెక్టులను కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కూడా తమిళనాడు, కేరళ , పశ్చిమ బంగాల్‌, అస్సాంలకు భారీగా కేటాయింపులు చేశారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు దూరం..

రైలు మార్గాల ప్రైవేటీకరణ, విద్యుత్తు పంపిణీ కంపెనీల ప్రైవేటీకరణ వంటి వాటిపై ప్రభుత్వం దూకుడుగా ముందుకు పోకపోవచ్చు. ఇప్పటికే లేబర్‌ లా కోడ్‌లపై రాష్ట్రపతి సంతకాలు జరిగినా ప్రభుత్వం నోటిఫికేషన్‌ మాత్రం విడుదల చేయకపోవడానికి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు కూడా ఓ కారణం. వివాదాస్పదమైన సంస్కరణలకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం దూరంగా ఉండే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని