Financial Planning: పిల్ల‌ల చ‌దువుల‌కు డ‌బ్బు స‌మ‌స్య కాకూడదంటే..?

ఉద్యోగంలో చేరిన నాటి నుంచే ఆర్థిక ప్రణాళికతో నడుచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.

Updated : 08 Apr 2022 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి - నాణ్యమైన విద్య. పిల్లలు ఆత్మవిశ్వాసంతో వారి వృత్తి, ఉద్యోగాల్లో ప్రగతి సాధించేందుకు, వారి వారి జీవిత లక్ష్యాలను సాధించేందుకు ఇది ఎంతోగానో తోడ్పడుతుంది. అప్పుడే వారు పనిచేసే రంగంలో ఉన్న‌త స్థాయికి ఎదగడంతో పాటు, తరువాతి తరాలకు ఆదర్శంగా నిలుస్తారు.

చిన్నత‌నం నుంచి నాణ్యమైన విద్య అందించగలిగితే, ఉన్నత తరగతులలో మిగిలిన విద్యార్థులతో పోటీ పడడం సులభమవుతుంది. నాణ్యమైన విద్య కోసం ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. సరైన ఆర్థిక ప్రణాళిక ద్వారా మాత్ర‌మే ఈ లక్ష్యాన్ని చేరుకోగలరు. సాధార‌ణంగా యువత ఉద్యోగంలో చేరి సంపాదించ‌డం ప్రారంభించిన త‌ర్వాత కారు కొనుగోలు, విహార యాత్రలు, ఇంటి కొనుగోలు వంటి వాటిని ల‌క్ష్యాలుగా ఎంచుకుంటారు. అయితే, వీటితో పాటు ప‌దవీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌, భ‌విష్య‌త్తులో వైవాహిక జీవితంలో అడుగుపెట్టేవారు పిల్ల‌ల కోసం, వారి భ‌విష్య‌త్తు కోసం తగిన ప్రణాళిక రూపొందించుకుని మదుపు చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు వ‌రుణ్‌కి 25 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరాడు. 30 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. 32 సంవత్సరాలకు పిల్లలు పుడితే, అతడికి 35 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి. అప్ప‌టి నుంచి పాఠశాల, కాలేజ్‌, ఉన్న‌త చ‌దువుల‌ కోసం ప్రముఖ విద్యాసంస్థలో చేర్చేందుకు తగిన మొత్తం అవసరం. అప్పటిక‌ప్పుడు డ‌బ్బు కావాలంటే.. అంద‌రికీ సాధ్యం కాదు. ముందు నుంచే ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం స‌మ‌కూర్చుకోవాలి. ఇందుకు చాలా పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. అయితే, మదుపు చేయడం ప్రారంభించే ముందు.. ఎంచుకున్న పెట్టుబడుల నియమ నిబంధనలు, కాలపరిమితి, రాబడి, లిక్వీడిటీ, రక్షణ, పన్ను ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి.

పెట్టుబ‌డులు ఆల‌స్యం చేయ‌కండి..
భ‌విష్యత్తులో పిల్లలు కావాలనుకునే వారు ముందు నుంచే వారి భ‌విష్య‌త్తు కోసం ప్రణాళిక‌ను సిద్ధం చేసుకోవ‌డం మంచిది. క‌నీసం పిల్లలు పుట్టిన సమయం నుంచైనా పెట్టుబ‌డులు ప్రారంభించాలి. నాలుగేళ్ల వ‌య‌సులో పాఠశాలలో చేర్చినప్పటి నుంచి కాలేజీకి వెళ్లి ఉన్న‌త విద్య పూర్తి చేసేంత వ‌ర‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం ఎంత మొత్తం ఖ‌ర్చ‌వుతుందో అంచ‌నా వేసి, అందుకు ఉన్న స‌మ‌యాన్ని బ‌ట్టి పెట్టుబ‌డుల‌ ప్రణాళిక వేసుకోవాలి. ముందు నుంచే పెట్టుబ‌డులు ప్రారంభిస్తే ఎక్కువ స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి కాంపౌండింగ్‌ ప్రభావంతో ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం సుల‌భం అవుతుంది.

ద్రవ్యోల్బణాన్ని అంచ‌నా వేయండి..
ద్రవ్యోల్బణం కారణంగా.. ప్రతి సంవత్సరం ఉన్నత విద్యకయ్యే ఖర్చు పెరుగుతూపోతుంది. 10 సంవత్సరాల క్రితం ఒక కోర్సు కోసం రూ.6 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయితే ఇప్పుడు అదే కోర్సు చ‌దివించేందుకు దాదాపు రూ.20 లక్షలు అవుతోంది. భ‌విష్య‌త్తులో ఈ మొత్తం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల‌ మీ పిల్లల విద్యా అవసరాలను లెక్కించేటప్పుడు, భవిష్యత్తులో విద్యకు అయ్యే ఖర్చులను అంచనా వేయడం ముఖ్యం.

ప్ర‌తీ ఏడాది ఫీజుల కోసం..
పిల్ల‌ల ఫీజులు, వారి ఇత‌ర అవ‌స‌రాల కోసం ప్ర‌తి సంవ‌త్స‌రం కొంత మొత్తం అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇందుకోసం రిక‌రింగ్ డిపాజిట్ల‌ను ఎంచుకోవ‌చ్చు. ప్ర‌తి నెలా కొంత స్థిర మొత్తాన్ని, స్థిర వడ్డీ రేటుతో నియమిత కాలంపాటు డిపాజిట్ చేస్తే, ఫీజులు చెల్లించాల్సిన స‌మ‌యానికి (మెచ్యూరిటీ సమయానికి) డ‌బ్బు చేతికందుతుంది. ఈ విధానం ద్వారా పెట్టుబడులు చేయడం అలవాటుగా మార్చుకోవ‌చ్చు. 1-3 ఏళ్ల పాటు డిపాజిట్ చేయొచ్చు.

ఉన్న‌త విద్య కోసం..
పిల్ల‌లు పుట్టిన వెంట‌నే వారి ఉన్న‌త విద్య‌కు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే.. దీర్ఘ‌కాల స‌మ‌యం ఉంటుంది. పీపీఎఫ్‌, ఎస్ఎస్‌వై, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు వంటి వాటిని ఎంచుకుని, కావాల్సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవ‌చ్చు.

పీపీఎఫ్: ఇది ప్ర‌భుత్వ హామీతో వ‌స్తున్న‌ దీర్ఘ‌కాల పొదుపు ప‌థ‌కం. మెచ్యూరిటీకి 15 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటుంది. అయితే, ఖాతా తెరిచిన‌ 7వ ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాలకు అనుమతిస్తారు. వార్షికంగా రూ.1.50 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 7.10 శాతం. ఈఈఈ ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

ఎస్ఎస్‌వై (సుకన్య సమృద్ధి యోజన): ఇది ప్ర‌త్యేకించి బాలికల కోసం రూపొందించిన ప‌థ‌కం. దీనిలో కూడా మెచ్యూరిటీకి దీర్ఘ‌కాల స‌మ‌యం ఉంటుంది. బాలికకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు పాక్షిక విత్‌డ్రాలను అనుమతించరు. వార్షికంగా రూ.1.50 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ప్ర‌స్తుత త్రైమాసికానికి 7.60 శాతం వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది. ఇందులో కూడా ఈఈఈ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

గమనిక: పై పెట్టుబడులకు వడ్డీ రేట్లను ప్రభుత్వం నిర్ణయించడం వల్ల రాబడి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఎక్కువ నిధి స‌మ‌కూర్చుకోలేక పోవ‌చ్చు. అయితే, పెట్టుబడులు పూర్తి సురక్షితంగా ఉంటాయి.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు: దీర్ఘకాలంలో (10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి) అధిక రాబడులను పొందొచ్చు. మీ న‌ష్ట‌భ‌యం ఆధారంగా తగిన ఫండ్‌ను ఎంచుకోవాలి. పెట్టుబడులకు గరిష్ఠ‌ పరిమితి లేదు. దీర్ఘకాలానికి, అధిక రాబడులతో ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. సిప్ విధానంలో నెలవారీగా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఉదాహరణకు.. సిప్ విధానంలో నెలవారీగా రూ.5 వేలు పెట్టుబడి పెడితే 20 సంవత్సరాల కాలవ్యవధిలో.. 12 శాతం రాబ‌డి అంచ‌నాతో దాదాపు రూ.50 ల‌క్ష‌లు స‌మ‌కూర్చుకోవ‌చ్చు. ఇందులో మీరు పెట్టుబ‌డి పెట్టే మొత్తం రూ.12 ల‌క్ష‌లు అయితే రాబ‌డి సుమారు రూ.38 ల‌క్ష‌లు. ప్రతి సంవత్సరం నెలవారీ సిప్‌ను 10 శాతం వరకు పెంచుకుంటే మ‌రింత రాబడులను పొందొచ్చు.

వైవిధ్యభ‌రితంగా పెట్టుబ‌డులు..
మొత్తం ఒకే పథకంలో కాకుండా వివిధ పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయడం ద్వారా నష్టభయం తగ్గించుకోవచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఆడ‌పిల్ల చ‌దువు కోసం పొదుపు చేసే వారైతే మీ మొత్తం పెట్టుబ‌డుల‌లో కొంత వ‌ర‌కు సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌లో పెట్టి, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో మదుపుచేయొచ్చు. ఈ విధంగా కొంత న‌ష్ట‌భ‌యం త‌గ్గించుకోవచ్చు. అంతేకాకుండా వివిధ సమయాల్లో నిధులు అందుబాటులో ఉంటాయి. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న‌వారికి వేరు వేరు స‌మ‌యాల్లో డ‌బ్బు అవ‌స‌రం కావ‌చ్చు. అలాంట‌ప్పుడు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఏదిఏమైనా మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ప్రతి పథకం గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

జీవిత బీమా..
జీవిత బీమాను ఎల్ల‌ప్పుడూ కుటుంబానికి రక్షణగా చూడాలి. అయితే చాలా మంది దీన్ని పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. ఒకవేళ ప్రమాద‌వశాత్తు ఇంటి పెద్ద మరణించినట్లైతే, ఆ ఆదాయాన్ని భర్తీ చేయడానికి, అలాగే కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడానికి జీవిత బీమా ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి సమయాల్లో కూడా మీ పిల్లలు వారి జీవిత లక్ష్యాలను సాధించడానికి కూడా ఇది సహాయపడుతుంది. మీ ప్రస్తుత వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 20 రెట్లు జీవిత బీమా కవరేజ్ ఉండేలా చూసుకోండి. అలాగే, 60 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు పాల‌సీని కొన‌సాగించాలి. టర్మ్ బీమా పాలసీతో మీరు అత్యధిక కవరేజ్ ను పొందగలరు. అలాగే, మీ కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భద్రత కల్పించవచ్చు. ఎండోమెంట్, హోల్ లైఫ్, మనీ బ్యాక్, యులిప్స్ వంటి పథకాలకు దూరంగా ఉండ‌డం మంచిది. వీటిలో ప్రీమియం ఎక్కువగానూ, రాబడి తక్కువగానూ ఉంటుంది. ఈ పథకాలలో తగిన జీవిత బీమా గానీ, రాబడి గానీ ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని