Money tips: సంపాదన పెరిగినా.. అప్పుల భారం తగ్గించుకోలేకపోతున్నారా..?
సరైన ప్రణాళిక, ఖర్చుల పట్ల నియంత్రణ లేకపోతే సంపాదన పెరిగినా..అప్పులు మాత్రం తీర్చలేకపోవచ్చు. సరైన వ్యూహాన్ని అనుసరిస్తే తొందరగానే రుణ విముక్తులు కావచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: అప్పు అనేది ఆర్థికంగానే కాదు.. మానసికంగానూ ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. అందుకే అప్పు చేసినప్పుడు సాధ్యమైనంత త్వరగా చెల్లించి.. బయటపడాలని చూస్తుంటాం. ఒక్క రోజులోనే అప్పు చేయొచ్చు.. కానీ, ఒక్క రోజులోనే తిరిగి చెల్లించలేం. తీసుకున్న రుణం, ఆర్థిక స్థితిగతులను అనుసరించి.. తిరిగి చెల్లించేందుకు కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు. కొంతమంది సంపాదన పెరిగిన తర్వాత ఎక్కువ ఈఎంఐ చెల్లించి త్వరగా అప్పు నుంచి బయట పడదాం అనుకుంటారు. కానీ జీతం పెరిగినా, ఈఎంఐలు పెంచడంలో విఫలం అవుతుంటారు. దీనికి కారణం సరైన ప్రణాళిక, ఖర్చుల పట్ల నియంత్రణ లేకపోవడమే. సరైన వ్యూహాన్ని అనుసరిస్తే తొందరగానే రుణ విముక్తులు కావచ్చు.
ఆదాయం, ఖర్చులు..
ఒక నెలలో ఆర్జించిన మొత్తం ఆదాయం, ఖర్చు చేసిన మొత్తం ఒక చోట రాసుకుంటే.. ఒక నెల ఆదాయంలో ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి ముందుగా 30 రోజుల మీ సంపాదన, ఖర్చుల జాబితాను రూపొందించండి. ప్రతి నెలా ఉండే తప్పనిసరి ఖర్చులను ఒకచోట, మిగిలినవి మరోచోట రాసుకోండి. అలాగే, కొన్ని ఖర్చులు ప్రతి నెలా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి మూడు/ఆరు నెలలకు, ఏడాదికి ఒకసారి చెల్లించాల్సినవి జాబితా చేయండి. ఉదాహరణకు పిల్లల స్కూలు ఫీజు తీసుకంటే.. ఇది ప్రతి నెలా ఉండకపోవచ్చు. కొంత మంది ఏడాదికి ఒకసారి చెల్లిస్తే, మరికొందరు ఆరు నెలలకు, ఇంకొందరు మూడు నెలలకు చెల్లిస్తారు. కాబట్టి, ఇలాంటి వాటి కోసం జాబితాను తయారు చేయండి.
అవసరం కాకపోతే కట్ చేయండి..
కొన్నిసార్లు మనం తెలియకుండానే వృథా ఖర్చులు చేస్తుంటాం. చిన్న మొత్తమే కదా అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ నెల చివరిలో చిన్న చిన్న ఖర్చులే ఆదాయాన్ని హరించి వేస్తాయి. ఉదాహరణకు కొందరు టీవీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, వివిధ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటారు. కానీ, వాటిని నెలలో కొన్ని గంటలు కూడా చూడరు. మరి అలాంటప్పుడు డబ్బు వృథానే అవుతుంది. అలాగే బయటకు వెళ్లిన ప్రతిసారీ అవసరం లేకపోయినా షాపింగ్ చేయడం, డిస్కౌంట్లో వస్తుంది కదా అని అవసరం లేకపోయినా కొనుగోలు చేయడం, ఇవన్నీ అనవసరపు ఖర్చులే అవుతాయి. కాబట్టి ఖర్చుల జాబితాలో అనవసరమైన వాటిని కట్ చేయండి.
వాయిదా వేస్తే.. మరింత నష్టం
అనవసరపు ఖర్చులను వాయిదా వేయాలి. కానీ, కొన్నింటిని సమయానికి చెల్లించాలి. కరెంటు, ఫోన్, ఇతర బిల్లులు గడువు తేదీలోపు చెల్లించే అలవాటు చేసుకోవాలి.. లేకపోతే అపరాధ రుసుములు చెల్లించాల్సి వస్తుంది. చిన్న మొత్తాలే కదా అని కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇది సరికాదు. అలాగే రుణ సంబంధిత ఈఎంఐలను ఆలస్యం చేసినా, దాటవేసినా బ్యాంకులు అపరాధ రుసుములు వసూలు చేస్తాయి. దీంతో మరింత భారం పెరుగుతుంది. అలాగే క్రెడిట్ స్కోరుపైనా దీని ప్రభావం పడుతుంది.
ఈఎంఐ చెల్లింపులు..
రుణం ఉన్నప్పుడు.. ఈఎంఐ చెల్లింపులకు మొదటి ప్రాధాన్యత ఉండాలి. ఇందుకోసం ఆటో-డెబిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రతి నెలా జీతం ఖాతాలో పడిన ఒకటి, రెండు రోజుల్లోనే ఆటో-డెబిట్ ఆప్షన్‌తో ఈఎంఐ చెల్లించేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈఎంఐ సరైన సమయానికి చెల్లించడం వల్ల పెనాల్టీలు, అదనపు ఛార్జీలు పడకుండా ఉంటాయి. అలాగే, క్రెడిట్ స్కోరు పెరుగుతూ ఉంటుంది.
క్రెడిట్ కార్డు ఉంటే..
క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నవారు.. గడువు తేదీకి ముందుగానే బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లించేలా ఏర్పాటు చేసుకోవాలి. కనీస మొత్తాన్ని చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలకు బదిలీ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే, క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవడం వంటివి చేయకూడదు.
సరైన రుణ చెల్లింపుల వ్యూహం ఉండాలి..
- ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మొత్తంలో రుణాలు ఉన్నవారు, చెల్లింపులకు తగిన వ్యూహాన్ని ఎంచుకోవాలి.
- ఇప్పటికే రుణాలు ఉన్నవారు కొత్త రుణాన్ని తీసుకోవడాన్ని నివారించాలి.
- ఎక్కువ రుణాలు ఉన్నప్పుడు.. ఖర్చుల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే ఈఎంఐ చెల్లింపులను పెంచగలుగుతారు.
- ఈఎంఐలు చెల్లించడం కష్టంగా ఉన్నట్లయితే.. పెట్టుబడులను లేదా ఆదాయం లేని ఆస్తులు విక్రయించి రుణ చెల్లింపుల కోసం వినియోగించవచ్చు.
- బోనస్, జీతం ఇంక్రిమెంట్ లేదా ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు వాటిని రుణ చెల్లింపుల కోసం వినియోగించవచ్చు.
- క్రెడిట్ కార్డు వంటి రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఇప్పటికే ఉంటే ముందు వాటిని క్లియర్ చేసేందుకు ప్రయత్నించాలి.
- చిన్న మొత్తాల్లో ఎక్కువ సంఖ్యలో స్వల్పకాలిక రుణాలు ఉంటే ఈఎంఐ చెల్లింపుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా వీటిని క్లియర్ చేసుకోవడం మంచిది.
- ఇప్పటికే గృహ రుణం ఉన్నవారు.. టాప్-అప్ లోన్ తీసుకుని చిన్న చిన్న రుణాలను క్లియర్ చేసుకుని.. ఒకటే ఈఎంఐ ఉండేలా చేసుకోవచ్చు.
చివరిగా..
క్రమశిక్షణతో, సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే రుణ భారం నుంచి తొందరగానే బయటపడొచ్చు. కాబట్టి ప్రస్తుతం మీకు ఉన్న రుణాలను అనుసరించి సరైన ప్రణాళికతో చెల్లింపులు చేయండి. ఎక్కువ మొత్తంలో రుణాలు ఉన్నవారు.. టర్మ్ బీమా హామీ మొత్తం కూడా ఎక్కువగానే ఉండేలా చేసుకోవడం మంచిది. ఇది మీరు లేనప్పుడు రుణ భారం కుటుంబ సభ్యులపై పడకుండా రక్షణను అందిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Manchu Manoj: ట్విటర్ వేదికగా మంచు మనోజ్ ట్వీట్స్.. విష్ణును ఉద్దేశించేనా?
-
Sports News
World Boxing Championship: మహిళల బాక్సింగ్ ప్రపంచకప్‌లో నీతూకు స్వర్ణం
-
Politics News
KTR: తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు నేర్పుతోంది: కేటీఆర్
-
India News
BJP: ‘అదానీతో సంబంధం లేదు.. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే..!’
-
India News
Corona Virus: కరోనా కలవరం.. కేంద్రం మార్గదర్శకాలు
-
Movies News
Naatu Naatu Song: ‘నాటు నాటు’ కేవలం ఫాస్ట్ బీట్ మాత్రమే.. అవార్డు వస్తుందనుకోలేదు: కీరవాణి