Adani Group: అదానీ గ్రూప్‌నకు నిధుల సమీకరణ ఇబ్బందే: మూడీస్‌

Moodys on Adani Group: అదానీ గ్రూప్‌ షేర్లు పతనం అవుతున్న వేళ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ స్పందించింది. ప్రస్తుత పరిణామాలు ఆ గ్రూప్‌ నిధుల సమీకరణకు అడ్డంకిగా మారనున్నాయని తెలిపింది.

Published : 03 Feb 2023 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదానీ గ్రూప్‌ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg research) చేసిన ఆరోపణలతో ఆ గ్రూప్‌ స్టాక్స్‌ వరుసగా కొన్ని సెషన్ల నుంచి పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ (Moody's) స్పందించింది. అదానీ గ్రూప్‌ మొత్తం ద్రవ్య లభ్యతను అంచనా వేస్తున్నామని తెలిపింది. ప్రస్తుత పరిణామాలు ఆ గ్రూప్‌ నిధుల సమీకరణకు అడ్డంకిగా మారనున్నాయని పేర్కొంది. రాబోయే ఒకటి రెండేళ్లలో ముందుగా నిర్దేశించుకున్న మూలధన వ్యయాలకు లేదా రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకోవడం కష్టం కావొచ్చని పేర్కొంది. అయితే, అదానీ గ్రూప్‌ కంపెనీలకు2025  చెల్లించాల్సిన రుణాలేవీ లేవని పేర్కొంది. అలాగే మూలధన వ్యయాల్లో కొన్ని వాయిదా వేయదగినవిగా గుర్తించామని పేర్కొంది.

మరో రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ సైతం స్పందించింది. అదానీ గ్రూప్‌ సంస్థలు, వాటి సెక్యూరిటీస్‌పై ఇప్పటికిప్పుడే ఎటువంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. నిధుల ప్రవాహం విషయంలో తమ అంచనాల్లో ఎలాంటి మార్పూ లేదని తెలిపింది. అలాగే, స్వల్పకాలంలో ఆ గ్రూప్‌నకు చెందిన ముఖ్యమైన ఆఫ్‌షోర్‌ మెచ్యూర్‌ బాండ్లు ఏవీ లేదని తెలిపింది. జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపింది. అదానీ గ్రూప్‌ సంస్థలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మరో రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది.

మరోవైపు అదానీ గ్రూప్‌ షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా ఈ స్టాక్స్‌ భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను ‘సస్టైనబిలిటీ సూచీ’ నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ డోజోన్స్‌ వెల్లడించింది. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు శుక్రవారం 15 శాతం నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ దాదాపు 70 శాతం కుంగిపోవడం గమనార్హం. గత ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లలో అదానీ గ్రూప్‌ (Adani Group)లోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.8.76 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు