Banks: ‘అప్పుడే అయిపోలేదు.. 2 ఏళ్లలో మరిన్ని బ్యాంకులు పడతాయ్‌!’

రాబోయే రెండేళ్లలో అమెరికాలోని మరిన్ని బ్యాంకులు పతనం అవుతాయని మ్యాన్‌ గ్రూప్‌ సీఈఓ పేర్కొన్నారు. బ్రిటన్‌లోనూ ఈ ముప్పు పొంచి ఉందని చెప్పారు.

Published : 22 Mar 2023 18:42 IST

Banks | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ కుప్పకూలడం.. స్విట్జర్లాండ్‌లోని క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌ పతనావస్థకు చేరడం.. యూబీఎస్‌ బ్యాంక్‌ దాన్ని కొనుగోలు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే స్టాక్‌ మార్కెట్లలో బ్యాంకింగ్‌ షేర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. అయితే, అప్పుడే అయిపోలేదని, మున్ముందు మరిన్ని బ్యాంకులు కుప్పకూలుతాయని హెడ్జ్‌ ఫండ్‌ మ్యాన్‌ గ్రూప్‌ సీఈఓ ల్యూక్‌ ఎల్లిస్‌ అన్నారు. బ్లూమ్‌ బెర్గ్‌ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బ్యాంకింగ్‌ సంక్షోభం ముగిసిందని అనుకుంటున్నారా అంటూ ఎదురైన ప్రశ్నకు ఎల్లిస్‌ సమాధానమిస్తూ.. అప్పుడే అయిపోలేదని ఆయన బదులిచ్చారు. రానున్న 12-24 నెలల్లో  మరిన్ని బ్యాంకులు కనుమరుగుకానున్నాయని చెప్పారు. ముఖ్యంగా అమెరికా చిన్న బ్యాంకులు, రీజినల్‌ బ్యాంకులపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని చెప్పారు. బ్రిటన్‌లోని బ్యాంకులు సైతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మంచైనా చెడైనా సోషల్‌ మీడియా కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని, బ్యాంకుల విషయంలో నెలకొంటున్న ఆందోళనలు సైతం అదే స్థాయిలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. సాధారణంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఒడుదొడుకులకు లోనైనప్పుడు హెడ్జ్‌ ఫండ్స్‌ సొమ్ముజేసుకుంటాయి. ఇటీవల కొన్ని హెడ్జ్‌ ఫండ్స్‌ ఇలానే ఆర్జించాయి. అయితే, తనకు మాత్రం అమెరికా రీజినల్‌ బ్యాంకుల్లో ఎలాంటి పొజిషన్లూ లేవని స్పష్టతనిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని