Twitter: ట్విటర్‌లో మరిన్ని తొలగింపులు.. వేలంలో లోగో ప్రతిమకు రూ.81 లక్షలు

Twitter Layoffs: ఇప్పటికే ట్విటర్‌లో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన ఎలాన్‌ మస్క్‌ ఇకపై కోతలు ఉండవని ఆరు వారాల క్రితం ప్రకటించారు. కానీ, ఆర్థిక కష్టాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మరికొంత మందిని ఉద్యోగాల నుంచి తీసేయాలనుకుంటున్నట్లు సమాచారం. 

Published : 19 Jan 2023 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) ట్విటర్‌ (Twitter) సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ దాదాపు సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసిందే. అప్పట్లో తొలగింపుల (Layoffs) ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇకపై ఎలాంటి ఉద్యోగుల కోతలు ఉండబోవని మస్క్‌ ప్రకటించారు. సరిగ్గా ఆరు వారాల తర్వాత మరింత మందిని తొలగించాలని (Layoffs) ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

మరో 50 మందికి త్వరలోనే మస్క్‌ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. ప్రొడక్ట్‌ విభాగంలో అధిక తొలగింపులు (Layoffs)  ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యాలయాలను, అమెరికాలోని చిన్న చిన్న ఆఫీసులను సైతం మూసివేయాలని మస్క్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మరిన్ని ఉద్యోగాల కోతలు తప్పవు. రెండు వారాల క్రితమే వాణిజ్య ప్రకటనలు, ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ, మానిటైజేషన్‌ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించారు. అలాగే సింగపూర్‌, ఆస్ట్రేలియాలోని కార్యాలయాల్లోనూ కొంతమంది సిబ్బందిని ఇంటికి పంపారు.

తాజా కోతలు కూడా అమల్లోకి వస్తే ట్విటర్‌ (Twitter) ఉద్యోగుల సంఖ్య 2,000 దిగువకు రానుంది. అంటే, 75 శాతం మందికి ఉద్వాసన పలికినట్లవుతుంది. ఇదే జరిగితే దశాబ్దం క్రితం కంపెనీ ఎంత చిన్నదిగా ఉందో.. తిరిగి ఆ స్థాయికి చేరుకుంటుంది. 2013లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ట్విటర్‌ (Twitter) తమ వద్ద 2,700 మంది ఉద్యోగులు ఉన్నట్లు అప్పట్లో వెల్లడించింది.

లోగో ప్రతిమకు రూ.81 లక్షలు..

మరోవైపు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉన్న అన్ని మార్గాలను మస్క్‌ వాడుకుంటున్నారు. తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలోని వస్తువులను వేలానికి పెట్టారు. ట్విటర్‌ (Twitter) లోగో అయిన పక్షి ప్రతిమతోపాటు కాఫీ మెషిన్లు, ఫర్నీచర్‌, చివరకు కిచెన్‌ సామగ్రిని కూడా విక్రయానికి ఉంచారు. ఈ వేలాన్ని హెరిటేజ్‌ గ్లోబల్‌ పార్ట్‌నర్స్‌ కంపెనీ నిర్వహించింది.

ఈ వేలంలో ట్విటర్‌ (Twitter) లోగో ప్రతిమకు అత్యధిక డబ్బు వచ్చినట్లు హెరిటేజ్‌ గ్లోబల్‌ వెల్లడించింది. నాలుగు అడుగుల ఈ ప్రతిమను 1,00,000 డాలర్లకు (దాదాపు రూ.81,25,000) ఒకరు సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కొనుగోలు చేసినవారి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. తర్వాత 10 అడుగుల నియాన్‌ ట్విటర్‌ (Twitter) బర్డ్‌ డిస్‌ప్లేకు వేలంలో 40,000 డాలర్లు (దాదాపు రూ. 32,18,240) లభించినట్లు తెలిపింది.

మరోవైపు బీర్లను స్టోర్‌ చేసుకునే మూడు కెగేటర్లు, ఫుడ్‌ డీహైడ్రేటర్‌, పిజ్జా ఓవెన్‌.. ఒక్కో దానికి 10,000 డాలర్లు (దాదాపు రూ.8,15,233) లభించినట్లు ఫోర్బ్స్‌ ఓ కథనంలో పేర్కొంది. ‘@’ (ఎట్‌దిరేట్‌) సింబల్‌ రూపంలో ఉన్న ప్లాంటర్‌కు 15,000 డాలర్లు (రూ. 12,21,990) లభించినట్లు సమాచారం. మరోవైపు ఓ కాన్ఫరెన్స్‌ రూం టేబుల్‌ 10,500 డాలర్ల (రూ. 8,55,393)కు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఫేస్‌మాస్క్‌లు, సౌండ్‌ప్రూఫ్‌ ఫోన్‌ బూత్‌లకు మరో 4,000 డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 631 రకాల వస్తువులను వేలానికి ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని