NHAI: 12,000 కి.మీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం: కేంద్రం

అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రోడ్ల నిర్మాణం కాస్త వెనుకబడ్డపప్పటికీ.. తిరిగి వేగం అందుకుందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది నిర్మాణ లక్ష్యాన్ని కచ్చితంగా అందుకుంటామని పేర్కొంది.

Published : 08 Jan 2023 14:42 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ ధీమా వ్యక్తం చేశారు. అందుకు కావాల్సిన నిధులనూ వేగంగా సమీకరించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ‘భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)’ రెండు దశల ఇన్విట్‌లలో రూ. 2,850 కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు.

రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యమవడం వల్ల జాతీయ రహదారుల నిర్మాణ వేగం కొంత తగ్గిందని ఉపాధ్యాయ తెలిపారు. ప్రస్తుతం లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశామని పేర్కొన్నారు. 2023 మార్చి నాటికి నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నవంబరు నాటికి 4,766 కి.మీ రహదారులను నిర్మించినట్లు తెలిపారు. 2019- 20లో 10,237 కి.మీ, 2020- 21లో 13,327 కి.మీ, 2021- 22లో 10,457 కి.మీ రోడ్లను నిర్మించినట్లు వెల్లడించారు. 2023లో రోడ్ల నిర్మాణ మంజూరుతో పాటు వాటిని వేగంగా పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ ఏడాది ఆస్తుల నగదీకరణ ద్వారా సమకూర్చుకోవాల్సిన రూ. 23,000 కోట్లను ఎన్‌హెచ్‌ఏఐ వివిధ మార్గాల ద్వారా చేపట్టనుందని ఉపాధ్యాయ తెలిపారు. ‘టోల్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌’ మోడల్‌, ఇన్విట్‌.. ఇలా వివిధ మార్గాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రోడ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయించిన అన్ని నిధుల్ని వినియోగించుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని